ఉచిత అంబులెన్సు, ఉచిత వాహన సేవలను ఏర్పాటు చేసిన 'నా ఊరు- విజయనగరం' స్వచ్ఛంద సంస్థను కలెక్టర్ ఎం.హరిజహర్ లాల్ అభినందించారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీటిని ప్రారంభించారు. ఇలాంటి కష్టకాలంలో, బాధితులను ఆదుకొనేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. కరోనా విస్తృతి తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా, కొవిడ్ బాధితులను ఆదుకొనేందుకు ఉచిత అంబులెన్సు సేవలను ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జి.విశాలాక్షి చెప్పారు. తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా సేవలను అందిస్తామని తెలిపారు. కొవిడ్ బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు, వేలాంగిణిమాత అంబులెన్స్ సర్వీసెస్ సహకారంతో ఉచితంగా అంబులెన్స్ సేవలను ప్రారంభించామన్నారు. అలాగే మృతదేహాలను శ్మశానవాటికకు తరలించేందుకు మరో వాహనాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు.
విజయనగరం డివిజన్లో, విజయనగరం కేంద్రంగా ఒకటి, పార్వతీపురం డివిజన్లో, బొబ్బిలి కేంద్రంగా మరో అంబులెన్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితో బాటుగా కొవిడ్ బాధితులకు ఉచితంగా భోజనాన్ని కూడా అందజేస్తున్నామన్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారు, ఆసుపత్రిలో ఉన్నవారు, ముందుగా తమకు ఫోన్ చేస్తే భోజనాన్ని అందిస్తామని తెలిపారు. తమ సంస్థ నుంచి సేవలు, సహకారం కోసం 9000336939 సెల్ నెంబరు ద్వారా సంప్రదించాలని విశాలాక్షి కోరారు. ఈ కార్యక్రమంలో వేలాంగిణి మాత అంబులెన్స్ సర్వీసెస్ ప్రతినిధి ఇజ్రాయిల్, నా ఊరు-విజయనగరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కె.చంద్రిక, చందు, తిరుపతిరావు, సూర్యప్రభ, మురళి పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. సిక్కు స్నేహితునికి.. అంత్యక్రియలు చేసిన ముస్లింలు