అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారని తెదేపా నేతలు విమర్శించారు. విజయనగరం జిల్లా తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెదేపా నేతలు మాట్లాడారు. ఇప్పటికే మద్యం, మైనింగ్, ఇసుక తదితర రంగాల్లో ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, నిరుపేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే 108 వాహనాల కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రూ.307 కోట్ల కుంభకోణంతో ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2007 నుంచి 2020 డిసెంబర్ వరకు బీవిజి సంస్థ 108 నిర్వహణ ఒప్పందం కలిగినప్పటికీ అర్ధాంతరంగా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి కట్టబెట్టారన్నారు. గడువు పూర్తి కాకముందే అరబిందో సంస్థకు కాంట్రాక్టు అప్పగించడంలో పరమార్థం ఏంటని ప్రశ్నించారు.
ప్రశ్నిస్తే అక్రమ కేసులా..
కుంభకోణాలకు పాల్పడుతున్న వారిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై సీఎం జగన్ ప్రభుత్వం దాడులకు తెగబడడం దారుణమన్నారు. వైకాపా నేతల అక్రమాలు బయటపడతాయనే భయంతో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని... ఈ ప్రభుత్వానికి త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల పక్షాన తెదేపా పోరాడుతుందని తెలిపారు.