Idem Kharma Mana Rastraniki programme in AP: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమం నిర్వహించారు. విజయనగరంలో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఆ తర్వాత కలెక్టరేట్ కూడలి నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కరపత్రాలను ప్రజలకు పంచారు. శ్రీకాకుళం దమ్మలవీధిలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నేతృత్వాన ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలుసుకున్నారు. జగన్ సర్కార్ దిగిపోయినప్పుడే ఇబ్బందులు తొలగిపోతాయని ప్రజలు భావిస్తున్నారని లక్ష్మీదేవి తెలిపారు. ఎచ్చెర్ల పరిధిలోని లావేరు మండలం కేవశరాయునిపాలెంలో కళా వెంకట్రావు ఈ కార్యక్రమం ప్రారంభించారు. గడిచిన మూడేళ్లలో కోటిన్నర మంది నిరుద్యోగంలో కూరుకుపోయారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య.. ఇంటింటికీ వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఒంగోలు మూడో డివిజన్‌లో వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం డివిజన్‌లో తిరుగుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
అద్దంకి: ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం నుంచి ఇసుక తరలింపును అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. తిమ్మాయపాలెం వద్ద ఇసుక దోపిడీని ఫోన్‌లో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. అడ్డగోలు తవ్వకాలతో పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారని వివరించారు. ఇసుక సరఫరాలో అక్రమాలపై కాంట్రాక్ట్ సంస్థ జేపీ ప్రతినిధులపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు.
తిరుపతి: మూడున్నరేళ్ల వైసీపీ పాలనతో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రజలు ఆగ్రహం ఉన్నారని... తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. పార్టీ నేతలతో కలిసి 44వ డివిజన్ సుందరయ్య నగర్‌లో పర్యటించారు. ప్రత్యేక ప్రశ్నావళిని ప్రజలకిచ్చి.. వారి ఇబ్బందులు నమోదు చేయించారు.
చిత్తూరు జిల్లా: పలమనేరు 23వ వార్డు మారెమ్మ ఆలయంలో పూజలు చేసిన తెలుగుదేశం నేతలు.. ఆ తర్వాత ఇదేం ఖర్మ పోస్టర్లు ఆవిష్కరించారు. కుప్పం అర్బన్ చీగలపల్లి, శాంతిపురం మండలం సొంతూరులో.... తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పన్నుల భారం మోయలేకపోతున్నామని నేతల ముందు జనం వాపోయారు.
నంద్యాల జిల్లా: మహానంది నుంచి బోయలకుంట్ల మెట్టకు వెళ్లే రోడ్డు దుస్థితిని... తెలుగుదేశం నేతలు వినూత్నంగా తెలియజేశారు. గుంతలు పడి దారుణంగా ఉన్న రోడ్డు కారణంగా బైక్‌లపై వెళ్లే ప్రజలు ఏవిధంగా కిందపడుతున్నారో చేసి చూపారు. ఇదేం ఖర్మ ఈ రాష్ట్ర రోడ్లకు అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చదవండి