ఈనెల 27న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో జరిగే ప్రజా చైతన్యయాత్రలో పాల్గొననున్నారు. జిల్లాలోని శృంగవరపుకోట, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై తెదేపా కార్యాలయంలో జిల్లా నేతలు కార్యకర్తలతో చర్చించారు.
రాష్ట్రంలో రంగులు వేసుకుంటూ పరిపాలన చేస్తున్నారని మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఏ గ్రామంలోనూ అభివృద్ధి జరగలేదన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సాగు భూములు లాక్కుంటున్నారని చెప్పారు. అన్నా క్యాంటీన్లు, ఇసుక, పింఛన్లు, కరెంట్ కోతలు, నిత్యావసర ధరలు ఇలా అన్నింటిలో విఫలమయ్యారని ఆరోపించారు. రాక్షసులతో పోరాడుతున్నా అని విజయనగరం సభలో ముఖ్యమంత్రి చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన తట్టుకోలేకపోతున్నామంటూ రోజూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఆయన ఇంటి దగ్గరే 144 సెక్షన్ పెట్టుకోవటం ఇందుకు నిదర్శనమన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో కార్యకర్తలు, నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడనికే భయపడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులు మీద ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు వారి సమస్యలు బయటకి చెప్పడానికి వస్తున్న వారి అరణ్యరోదన వినడానికి ప్రభుత్వానికి సమయం లేదన్నారు. దిశా చట్టం తీసుకురావడం మంచిదే కానీ 21 రోజుల్లో విచారణ ఎలా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు.