విజయనగరంజిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్దంలోని బోడికొండపై ఉన్న రాములోరి విగ్రహం ధ్వంసం ఘటనపై భాజపా, తెలుగుదేశం నేతలతో పాటు హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహిస్తూ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఎంతో పవిత్రస్థలమైన రామతీర్ధాల పుణ్యక్షేత్రంలో రాములోరి దేవాలయంపై దాడి దురదృష్ణకరమని భాజపా, తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు ప్రభుత్వమే నిర్లక్ష్యమే కారణమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కోదండ రాముని విగ్రహం ధ్వంసం ఘటన కేసును ఛేదించేందుకు పోలీసులు 5 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు భద్రాద్రి రాములోరిగా కొలిచే రామతీర్థం వద్ద రాముడి విగ్రహం ధ్వంసం కావడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉషోదయాన.. తారల ఆశోదయం!