ఏపీ - ఒడిశా రాష్ట్రాల్లో సరిహద్దులో కొఠియా గ్రూఫ్ లో 23 గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల విభజన సమయంలో తలెత్తిన వివాదం నేటికీ కొనసాగుతోంది. ఈ గ్రామాలపై ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో.. స్టేటస్ కో విధించింది. అయితే.. అభివృద్ధి పేరుతో ఈ గ్రామాల్లో ఆధిపత్యం చలాయించేందుకు ఇరు రాష్ట్రాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా అప్పటి విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, పార్వతీపురం ఐడీటీఏ పీవో లక్ష్మీ 2018 జనవరిలో కొఠియాలో పర్యటించి జన్మభూమి- మాఊరు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒడిశా ప్రభుత్వం, అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఆంధ్ర అధికారులు కొఠియాకు వెళ్తున్నారని తెలిస్తే చాలు.. ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు నిరసనలకు దిగుతున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారు..
తాజాగా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్లు సోమవారం పగులుచెన్నారు, పట్టుచెన్నారుల్లో ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఒడిశా అధికారులు శంకుస్థాపనలను అడ్డుకునేందుకు వ్యూహం పన్నారు. శాంతిభద్రతల పేరు చెప్పి ఆ రాష్ట్ర బలగాలను రంగంలోకి దించారు. శంకుస్థాపన ఏర్పాట్ల కోసం సోమవారం ఉదయం పట్టుచెన్నారు వెళ్తున్న ఏపీకి చెందిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును అడ్డుకొని తిరిగి పంపించేశారు. పాఠశాల తెరవడానికి వెళ్లిన పగులుచెన్నారు ఉపాధ్యాయుడిని అడ్డుకున్నారు. ఆ గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. ఒడిశా నేతలు, కార్యకర్తలను మాత్రమే అనుమతించారు. గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని తలపింపజేశారు. అధికారుల ఆధ్వర్యంలో ఒడిశాకు చెందిన ఐదు ఫ్లటూన్ల పోలీసులు పహారా కాశారు. ఒడిశా పోలీసులు, అధికారులు అధికంగా రావడంతో కొఠియా గ్రూప్ గ్రామాల ప్రజలు భయపడ్డారు.
మరో వైపు ఒడిశాకు చెందిన బీజేడీ, భాజపా, కాంగ్రెస్ నేతలు పట్టుచెన్నారు చేరుకొని ఏపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాలూరు ఎమ్మెల్యే గో బ్యాక్, ఏపీ గో బ్యాక్ టూ నినాదాలు చేశారు. కోరాపుట్, పొట్టంగి, జయపరం, లక్ష్మీపూర్ ఎమ్మెల్వేలు రఘురాం పదాల్ ప్రీతంపాడి వాహినీపతి, ప్రభుజాని, కొరాపుట్ మాజీ ఎంపీ జయరాం పంగి, మాజీ ఎమ్మెల్యే రామచంద్రకడెం.. కలియ తిరిగారు. ఏపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కొఠియాను వదులుకోబోమని ప్రతిజ్ఞ చేశారు.
ఏపీ వెనకడుగు..
ఒడిశా దుందుడుకు చర్యలు గమనించిన విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి కొఠియా గ్రామాల్లో అభివృద్ధి కార్య క్రమాలు వాయిదా వేసుకోవాలని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరను కోరారు. ఒడిశా అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలు హల్చల్ చేయడంతో శంకుస్థాపనను తాత్కాలికంగా వాయిదా వేశారు. విజయనగరం కలెక్టర్ సూర్యకుమారితో కొరాపుట్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ అక్తర్ చర్చించినట్టు తెలిసింది. అనంతరం అక్కడి కలెక్టర్ ఒడిశా మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే కారణంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు చెప్పడం గమనార్హం.
నలిగిపోతున్న గిరిజనలు..
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా కొఠియా గ్రామాల్లోని అమాయక గిరిజనులు నలిగిపోతున్నారు. పోడు వ్యవసాయం, కొండ కోనలు మినహా ఏదీ తెలియని వారు వరుస ఘటనలతో ఆందోళన చెందుతున్నారు. సోమవారం అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్న పగులుచెన్నూరు, పట్టుచెన్నూరు పంచాయతీలు, మధుర గ్రామాల్లోని ప్రజలను బయటకు వెళ్లకుండా ఒడిశా నాయకులు, అధికారులు అడ్డుకున్నారు. బయట నుంచి వచ్చే చిరు వ్యాపారులను సైతం నిలిపేయడంతో కొదము గ్రామస్థులు పలు ఇబ్బందులకు గురయ్యారు. వీరితో పాటు గంజాయిభద్ర పగులుచెన్నూరు, పట్టుచిన్నూరు పరిధిలోని ఏపీ ఉద్యోగులు భయపడుతున్నారు. విధి నిర్వహణకు వెళ్లే వారిని అడ్డుకుంటే ఏం చేయాలని ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్ వాడీలు, ఏఎన్ఎంలు ప్రశ్నిస్తున్నారు
ఇదీ చదవండీ.. Viveka Murder Case: వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్కు రిమాండ్ పొడిగింపు