శిక్షణకు వచ్చిన మహిళా ఎస్‌ఐ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరం ఒకటో పట్టణ సీఐ జె.మురళి కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్‌ఐ కె.భవాని (27) నేర విశ్లేషణ (సీడీ) శిక్షణ కోసం 5 రోజుల క్రితం జిల్లాకు వచ్చారు. నగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలోని (పీటీసీ) క్వార్టర్స్‌లో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం శిక్షణ ముగియడంతో తన గదికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన పనివారు తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీ తెరచి చూశారు. భవాని ఉరేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ దీపిక ఎం.పాటిల్, డీఎస్పీ పి.అనిల్ కుమార్ పరిశీలించారు. వ్యక్తిగత కారణాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు ఎస్పీ దీపిక చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. భవానితోపాటు శిక్షణకు వచ్చిన రాజోలు ఎస్‌ఐని సుదీర్ఘంగా విచారించారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం సాలెంపాలెం గ్రామానికి చెందిన భవాని 2018 బ్యాచ్ ఎస్‌ఐ. తూర్పుగోదావరి జిల్లా రాజోలు స్టేషన్‌లో తొలి పోస్టింగ్ పొందారు. అక్కడి నుంచి సఖినేటిపల్లికి బదిలీ అయ్యారు. భవాని మృతి గురించి తెలిసి.. విజయవాడ నుంచి ఆమె తల్లి విజయలక్ష్మి, విశాఖలో ఉంటున్న సోదరుడు శివ పీటీసీకి చేరుకున్నారు. తన సోదరి ఎంతో కష్టపడి పైకి వచ్చిందని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని శివ అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఉద్యోగ విధులేనా, సరదాగా సింహాచలం వెళ్లి వద్దామంటూ శనివారం సాయంత్రం తనతో భవాని మాట్లాడిందని, ఇలా ఎందుకు చనిపోయిందో అర్థం కావట్లేదని పూసపాటిరేగ ఎస్‌ఐ జయంతి వాపోయారు.
అనుమానాలెన్నో...
శనివారం శిక్షణ ముగిసినా భవాని అక్కడే ఉండిపోయారు. ఉదయం వెళతానని అధికారులకు చెప్పినట్లు తెలిసింది. కోనసీమలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్సైతో భవానీకి బంధుత్వం ఉంది. శనివారం రాత్రి ఆమె ఆ ఎస్సైతో ఫోనులో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండి మాట్లాడినట్లు, ఆయన హుటాహుటిన విజయనగరం వెళ్లినట్లు తెలిసింది. తమ బంధువులకు బాగోలేదని, అత్యవసరంగా విజయనగరం వెళ్లాలని చెప్పి ఆయన పై అధికారుల అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎస్సై హుటాహుటిన విజయనగరం వెళ్లడం, భవాని మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆయన చెప్పకపోవడంపై శాఖాపరంగా ఆరా తీస్తున్నారు. భవాని కాల్ డేటా, ఇతర వివరాలపై కూపీ లాగుతున్నారు.
‘కేసును నీరుగార్చేందుకు అసత్య ప్రచారం’
భవానీని చంపేయటమో... చనిపోయేలా ఒత్తిడి తీసుకురావటమో చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అగ్నికుల క్షత్రియ సంఘం జాతీయ అధ్యక్షుడు నాగిడి సాంబశివరావు ఆరోపించారు. కేసును నీరుగార్చేందుకే ఎలాంటి నిజ నిర్ధారణ కాకుండానే ఆత్మహత్య చేసుకుందంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండు చేశారు.
ఇదీ చదవండి: అర్ధరాత్రి ఏనుగుల హల్‌చల్.. భయంతో పరుగులు తీసిన జనం