కోస్తాంధ్రలో నెల్లూరు జాతి గొర్రెలు, రాయలసీమలో బళ్లారి జాతి గొర్రెలు, తెలంగాణలో దక్కన్ జాతి గొర్రెలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం విజయనగరం గొర్రె జాతికి పేరు. ఈ జాతికి చెందిన పొట్టేళ్ల శరీరంపై తెల్ల, నల్ల మచ్చలు ఉంటాయి. కొమ్ములు 2, 3 వంకర్లు తిరిగి ఉంటాయి. వీటిలో కొన్నింటికి పొడవైన చెవులుంటే... తక్కువ సంఖ్యలో పొట్టి చెవులు కలిగి ఉంటాయి. ఇంకొన్ని మెలిక చెవులతో ఆకట్టుకుంటాయి. ఇలాంటి పొట్టేళ్లు భారీ సంఖ్యలో ఒక చోట కొలువుదీరాయి. గజ్జెలు, పట్టీలు, కొమ్ములకు వివిధ రంగుల వంటి ప్రత్యేక అలంకరణతో విజయనగరం జిల్లా బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రదర్శనకు వచ్చాయి. బొబ్బిలి ఎమ్మెల్యే చినఅప్పలనాయుడు ఈ ప్రదర్శనను ప్రారభించారు.
పెంపకంపై అవగాహన
ఈ పొట్టేళ్ల ప్రదర్శనలో గొర్రెల పెంపకందార్లు తమ జీవాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వందకు పైగా పొట్టేళ్లు ప్రదర్శనకు తరలి రావటం వలన ప్రాంగణమంతా సందడిగా మారింది. ప్రదర్శన చూసేందుకు గొర్రెల కాపర్లు, రైతులు, స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రదర్శన అనంతరం విత్తన పొట్టేళ్ల పెంపకందార్లకు పలు సలహాలు, సూచనలు అందించారు. యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించే లక్ష్యంతోనే ప్రదర్శన నిర్వహించినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ప్రదర్శనలో పాల్గొని మేటిగా నిలిచిన పొట్టేళ్ల పెంపకందార్లకు బహుమతులు అందచేశారు. పొట్టేళ్ల ప్రదర్శన ఏర్పాటుపై పెంపకందార్లు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :