విజయనగరం జిల్లా సీతానగరం అంటే వాహనదారులకు ఒకప్పుడు రైల్వే గేటు కష్టాలు ఉండేవి. సువర్ణముఖి నదిపై వంతెన ప్రారంభంతో ఆ కష్టాలు తీరాయనుకున్నారు. కానీ ఆ వంతెన తరచూ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గతంలో వంతెన ఒకసారి కుంగిపోయింది. నిధులు మంజూరైనా పనులు మాత్రం మొదలుకాలేదు. వంతెన వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు మరోసారి వంతెన మధ్యలో కుంగిపోవడం ప్రయాణికులను భయపెడుతోంది.
నిత్యం వేలాది వాహనాలు ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తుంటాయి. వంతెన దెబ్బతిన్న కారణంగా ఈ మార్గంలో రెండు రోజులుగా రాకపోకలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెనపై రాకపోకలు నిలిపివేసినా మరో మార్గం లేక కాలినడకన ప్రయాణికులు వంతెనపై వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
పార్వతీపురం నుంచి విశాఖ, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు వందలాది బస్సులు, లారీలు ప్రతిరోజు ఈ మార్గంలో తిరుగుతుంటాయి. వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తాయి. ఇంతటి ప్రధాన రహదారి వంతెనపై రాకపోకలు నిలిపివేయటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి;