రాష్ట్రంలోని 10 జిల్లాల్లో సుమారు 21వేల మంది విద్యార్థులకు పాఠశాలలు అందుబాటులో లేనట్లు సమగ్ర శిక్ష అభియాన్ గుర్తించింది. వీరికి నెలకు రూ.600 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాస్తవ రవాణా ఛార్జీలు చెల్లించకపోవడంతో కొన్నిచోట్ల తల్లిదండ్రులు భారం మోయాల్సి వస్తుండగా.. మరికొన్ని చోట్ల విదార్థులకు నడక తప్పడం లేదు.
విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ మేరకు రాష్ట్రంలో విద్యార్థుల ఆవాసాలకు దూరంగా ఉన్న బడుల వివరాలను సమగ్ర శిక్ష అభియాన్ సేకరిస్తోంది. ఇప్పటికే 10జిల్లాల వివరాలను సేకరించారు. శ్రీకాకుళం, గుంటూరు, కడప జిల్లాల సమాచార సేకరణ కొనసాగుతోంది.
* విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పెద్ద పారన్నవలస, భవానీపురం గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆరోతరగతి చదివేందుకు వేగవతి నదిని దాటుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు గ్రామాల వారు నాలుగు నుంచి నాలుగున్నర కిలోమీటర్ల వరకు నడక సాగించాల్సి వస్తోంది.
* విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులు చదువుకునేందుకు వాగులు, వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇదీ చదవండీ... పెట్రో ధరల పెరుగుదల: నష్టాల బాటలో రవాణా సంస్థలు..!