కరోనా వైరస్ పల్లెల్లోనూ విస్తృతంగా వ్యాపిస్తోంది. మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు మే, జూన్ నెలలకు డబుల్ రేషన్ ప్రకటించాయి. ఒక్కోకార్డు దారుడికి 10 కిలోల బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ సమక్షంలో కార్డుదారుడి వేలిముద్రలు తీసుకుని సరకులు సరఫరా చేస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వేలి ముద్రలు వేయించడం ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉందని లబ్ధిదారులు, పంపిణీదారులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట రేషన్ వాహనాల ఆపరేటర్లు ఇదే విషయమై ధర్నా నిర్వహించారు. వైరస్ ప్రభావం తగ్గే వరకు బయోమెట్రిక్ లేకుండా నేరుగా పంపిణీ చేసేలా అవకాశం ఇవ్వాలని.. తమకు రక్షణ పరికరాలు అందించాలని కోరుతున్నారు.
ప్రజలకు డబుల్ రేషన్ పంపిణీ తమకు మరింత ఆర్థిక భారంగా మారిందని పంపిణీదారులు వాపోతున్నారు. బియ్యం బస్తాల లోడింగ్‌కు సహాయకులకు అధికంగా కూలీ చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదని.. ఆర్థిక సాయం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు మాత్రం కొవిడ్ నిబంధనలు అనుసరించే వాహనదారులు బియ్యం పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. వారికి మాస్కులు, శానిటైజర్లు ఇస్తున్నామంటున్న అధికారులు.. బయోమెట్రిక్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు.
ఇదీ చదవండి: బంగాల్లో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు వాయిదా!