రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ తప్పనిసరి అని ప్రకటించడంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ఉదయం నుంచే కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. రోడ్డు పొడవునా సుమారు కిలోమీటరు మేర బారులు తీరిన వీరంతా రేషన్‌కార్డుదారులు. శుక్రవారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇలా వరుసలో నిల్చున్నారు. తిండి కూడా లేకుండా పిల్లలతో సహా పడిగాపులు పడ్డారు. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ తప్పనిసరి అని ప్రకటించడంతో ఆ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు ప్రజలు పాట్లు పడుతున్నారు.
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని తపాలా కార్యాలయంలో ఆధార్ అనుసంధానానికి ముందస్తుగా టోకెన్లు జారీ చేయడంతో పాచిపెంట, మక్కువ, సాలూరు మండలాలకు చెందిన పలువురు రేషన్‌కార్డుదారులు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం పెద్దఎత్తున తరలివచ్చారు. వచ్చే నెల 10వ తేదీ వరకు రోజుకు వంద మందికి చొప్పున టోకెన్లను అధికారులు జారీ చేశారు. సుదీర్ఘ సమయం పట్టడంతో వరుసలో ఉన్నవారు ఇబ్బందులు పడ్డారు. అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసేలా ఆధార్ కేంద్రాలను పెంచాలని కార్డుదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఆధార్ సమస్యల పరిష్కారానికి విజయవాడలో 'యూఐడీఏఐ ప్రత్యేక డ్రైవ్'