విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో... భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కుటుంబాల మధ్య అనుబంధాలు సన్నగిల్లుతున్నాయి. ఆప్యాయతలు మరచి శత్రువులుగా వ్యవహరిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఉదంతమే భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో జరిగింది.
పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామానికి చెందిన రామ గురువులకు 1.90 ఎకరాలు భూమి ఉంది. ఇది సమీప బంధువైన బసవ అచ్చిబాబు విక్రయించేందుకు గతంలో అగ్రిమెంట్ రాసుకున్నారు. రిజిస్ట్రేషన్ రెట్టింపు కావడంతో ఆ భూమిని... విజయవాడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఎక్కువ మొత్తానికి అమ్మకానికి రామగురువులుతో ఒప్పందం చేసుకున్నారు. శుక్రవారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్రయ విక్రయదారులు భోగాపురం వచ్చారు. ఇదే విషయమై గత రెండు రోజులుగా రాము గురువులు, అచ్చిబాబుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. గతంలో భూమి ఇస్తానని అగ్రిమెంట్ రాసుకొని ఇప్పుడు ఇతరులకు ఇవ్వడం సబబు కాదంటూ అచ్చిబాబు అతని కుమారుడు ఉపేంద్ర వాదించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తండ్రి,కుమారుడు ఆగ్రహంతో తమ వెంట తీసుకొచ్చిన కత్తితో... రాము గురువులుతో పాటు వచ్చిన ఆయన కుమార్తె అరుణపై దాడికి దిగారు. కత్తిపోట్లకు గురైన అరుణ కింద పడిపోయింది.
ఈ దాడి ఘటన శ్రీనివాస్ రెడ్డితో వచ్చిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి చరవాణితో చిత్రీకరించటాన్ని ఉపేంద్ర గమనించాడు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నావంటూ ఆయనతో గొడవపడి కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమవ్వటంతో... ఇద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సిఫారసు మేరకు అక్కడినుంచి వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రవీణ్ కుమార్కు కడుపులో రెండు చోట్ల వెనుక భాగంలో ఒక చోట గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, సీఐ శ్రీధర్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితులు ఉపేంద్ర, అచ్చిబాబులతో పాటు బసవ వెంకటేష్, కే.అప్పల రెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.