ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత, పూసపాటి వంశీయుల ఇలవేల్పు... పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం నయనానందకరంగా సాగింది. తల్లి దర్శనభాగ్యం కోసం లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జాలరి వల... తెల్ల ఏనుగు... అంజలి రథం వెంటరాగా... పైడితల్లి ఆలయం వద్ద అమ్మవారు సిరిమాను అధిరోహించి... మూడులాంతర్ల మీదుగా కోట కూడలికి చేరుకుంది. కోట నుంచి కోవెల... కోవెల నుంచి కోట వరకూ ముమ్మారు ప్రదక్షిణలు చేసింది. గంటన్నరపాటు సాగిన సిరిమాను మహోత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు... ఒడిశా నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
మార్మోగిన 'జై పైడిమాంబ' నినాదాలు
పూజారి రూపంలో సిరిమాను అధిరోహించిన అమ్మవారిని చూసేందుకు... మధ్యాహ్నం ఒంటి గంటకే భక్తులు బారులు తీరారు. ఎత్తయిన భవంతులపైకి ఎక్కి సిరిమాను సంబరాన్ని కనులారా తిలకించారు. అమ్మవారికి అరటికాయ రూపంలో కానుక సమర్పించి... "జై పైడిమాంబ" అంటూ నినాదాలు చేశారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స
రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న పైడితల్లి ఉత్సవాలను... ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ... అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలోకి వెళ్లి... అమ్మవారి చెంత పట్టువస్త్రాలను ఉంచారు. దేవాలయ సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన అర్చకులు.... మంత్రి కుటుంబసభ్యులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
సిరిమానోత్సవానికి తరలివచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 20 శుద్ధ తాగునీటి కేంద్రాలు, 30 మొబైల్ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచింది. రెవెన్యూ ఉద్యోగుల సంఘం... భక్తులకు అన్నదానం చేసింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవలు అందించాయి. పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే... భద్రతా చర్యల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంటకే అమ్మవారి ఆలయానికి చేరుకునే దారులన్నీ మూసేయడంపై భక్తులు అసహనం వ్యక్తంచేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చినవారిలో కొంతమంది.... అమ్మవారిని దగ్గరగా చూడలేకపోయామని నిరాశ చెందారు.
ఇదీ చదవండి : విజయనగరంలో పైడితల్లి సిరిమాను ఉత్సవం