విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రధాన రహదారిపై పడిన దోమల మందు ప్రమాదాలకు దారీ తీసింది. కాల పరిమితి మించిన దోమల నివారణ మందు డంపింగ్ యార్డ్‌కు తరలిస్తుండగా.. రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బెలగాంలోని రక్షిత నీటి సరఫరా రిజర్వాయర్ సమీపంలో సుమారు రెండేళ్ల క్రితం డ్రమ్ములో దోమల నివారణ ముందు ఉంచారు. కొంత వాడగా మరికొంత మిగిలి ఉంది. దానికి కాలపరిమితి మించి పోవడంతో జేసీబీ సహాయంతో డంపింగ్ యార్డ్‌కు తరలించే చర్యలు చేపట్టారు. డ్రమ్ముకు రంధ్రం పడటంతో పిచికారి ద్రావణం కారడం ప్రారంభించింది. తరలించే సిబ్బంది దానిని పట్టించుకోకుండా డంపింగ్ యార్డ్ తీసుకువెళ్లారు. ప్రధాన రహదారిలో సుమారు కిలోమీటరు దూరం వరకు ద్రావణం రోడ్డుపై పడింది. ఇంధనం మాదిరిగా ఉండడంతో ద్విచక్ర వాహన చోదకులు అసౌకర్యానికి గురయ్యారు. పట్టణంలో పలుచోట్ల వాహన చోదకులు జారి పడటంతో 108 వాహన సిబ్బంది పోలీసులు అగ్నిమాపక శాఖ అప్రమత్తమయ్యారు.
ద్రావణం పడిన మార్గం గుండా కొంతవరకు వాహనాలు వెళ్లకుండా దారి మళ్లించారు. సుమారు 20 మంది వరకు పైగా స్వల్ప గాయాలయ్యాయి. నిల్వ ఉన్న ద్రావణం కావడంతో సుమారు మూడు గంటల వరకు దుర్గంధం వ్యాపించింది. రోడ్డుపై జారిపడ్డ కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: