Botsa Satyanarayana comments on R5 zone: అమరావతిలో ఆర్-5 జోన్ విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంటోంది.. సామాన్యులు, మధ్యతరగతి వారికి ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కాదనడం సరికాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజా వినతుల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగర జిల్లా కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వీక్షించారు.
అనంతరం, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమ ఉద్దేశ్యం, నిర్వహణ తీరుని తెలియచేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.., రాజధాని ప్రాంతంలో ధనవంతులు, భవంతులు కట్టుకునే వారు మాత్రమే ఉండాలంటే, అది ప్రైవేటు స్థలం కాదన్నారు. రాజధాని ప్రాంతంలో సామాన్యులు, మధ్య తరగతి ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. రాజధాని నివాసిత ప్రాంతం కాదా.. 30వేల ఎకరాల్లోనూ భవనాలు కట్టాలని ఇచ్చారా అంటూ... బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
అమరావతిలో ఆర్-5 జోన్లో సామాన్యులు, మధ్యతరగతి వారికి ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కాదనడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రైతు పోరు యాత్ర, కేవలం చంద్రబాబు గుర్తింపు కోసమే అని బొత్స పేర్కొన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు చెప్పటం కాదు.., ఆ విషయాన్ని ప్రజలు, రైతులు చెప్పాలన్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఒక్కో జిల్లాకు ఒక్క ప్రత్యేక అధికారిని పంపించాం. అక్కడి పరిస్థితులను పరిశీలించి, పర్యవేక్షించి, తడిచిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించామని మంత్రి తెలిపారు. చంద్రబాబు వచ్చాడనో, వెళ్లాడనో మేము చేయం. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవటం మా బాధ్యత అని మంత్రి తెలిపారు. మా ప్రభుత్వ విధానం ప్రకారం అనుసరిస్తామని బొత్స పేర్కొన్నారు. ఈ మేరకే సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకున్నారని అన్నారు.
'రాజధానిలో సామాన్యులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఇవ్వద్దని అడ్డుపడుతున్నారు. రాజధాని ప్రాంతంలో ధనవంతులు, భవంతులు కట్టుకునే వారు మాత్రమే ఉండాలంటే, అది ప్రైవేటు స్థలం కదా? రాజధానిలో పేదలకు సైతం ఇళ్లు ఇవ్వకూడదని ఎక్కడైనా ఉందా. వర్షాలపై మేము వెంటనే స్పందించి వివిధ జిల్లాలకు పర్యవేక్షణ అధికారులను పంపించాం. పంట నష్టంపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.'- బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి
ఇవీ చదవండి: