Minister Anil fires on TDP: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఇదే మాటను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చెప్పగలరా? అంటూ.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వన్ సైడ్ లవ్ అంటూనే జనసేన, భాజపాను పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలం గుండపురెడ్డి పాలెం వద్ద రూ.63 కోట్లతో చేపట్టిన సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు ప్యాకేజీ-2 పనులకు మంత్రి అనిల్.. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.
ప్రజల మనన్నలు పొందిన సీఎం జగన్.. మరో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి అనిల్ ధీమా వ్యక్తం చేశారు. సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామన్నారు. చంద్రబాబు ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. పట్టిసీమ కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. 92 శాతం పూర్తి చేస్తే.. దానికి లిఫ్టులు పెట్టారని అన్నారు. తోటపల్లి కాలువ పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాంతాలకూ నీరందించేలా ప్రణాళికలు చేశామని, కరోనా కారణంగా కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయని తెలిపారు.
రైతుల నుంచి ప్రతీ గింజ కొనుగోలు చేస్తాం: మంత్రి బొత్స
గతంలో ఈ ప్రాంతంలో పంటలు పండే పరిస్థితి లేదని, ఇప్పుడు దిగుబడి అధికంగా ఉండి.. అమ్ముకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేస్తామని, దళారులను ఆశ్రయించవద్దని కోరారు. కాస్త ఆలస్యమైనా చెల్లింపులు చేస్తామన్నారు. తోటపల్లి పనులు సకాలంలో పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం జరిగేదే చెబుతుందని, చెప్పిందే చేస్తుందని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి:
MatsyaKara Abhyunnathi Sabha: జీవో 217 ప్రతులను చింపిన పవన్.. వెనక్కి తీసుకోవాలని డిమాండ్