విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఈ ఏడాది సుమారు 11 వేల ఎకరాల్లో మామిడి సాగుచేశారు. అయితే అకాల వర్షాల వలన పంట సాగు ఆశాజనకంగా లేదు. దానికితోడు తెగుళ్లు. ఎలాగో పంట పండించినా కోతల సమయం వచ్చేసరికి లాక్ డౌన్‌తో మరింత నష్టపోయాడు రైతన్న. రవాణా సౌకర్యాలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్లో కిలో మామిడి 10 నుంచి 12 రూపాయలే పలుకుతుందని.. ఇలా అయితే పెట్టిన పెట్టుబడి కూడా రాదంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అప్పులు తెచ్చి, వేలకు వేలు కౌలు కట్టి, పెట్టుబడి పెట్టి పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దీనిపై అగ్రికల్చర్ ఎండీ వేణుగోపాలరావు మాట్లాడుతూ.. రైతులు పంట అమ్ముకునేందుకు తాము అన్ని విధాలా సహకరిస్తామన్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ పంట ఉత్పత్తుల రవాణాకు ఎలాంటి అవాంతరం లేదన్నారు. పంటను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవాలనుకునే రైతులకు వాహన పాసులు మంజూరు చేస్తామని... వాటితో ఎక్కడికైనా వెళ్లొచ్చని తెలిపారు. అన్నదాతలు తమ పంటను ఈ-కర్షక్‌లో నమోదు చేస్తే ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినప్పుడు బీమా వస్తుందని సూచించారు.
ఇవీ చదవండి.. అటు మామిడి.. ఇటు ధాన్యం.. అమ్ముకొనేదెలా?