విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన బాలల సాహిత్య రచయిత బెలగాం భీమేశ్వరరావు కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన రచించిన 'తాత మాట వరాల మూట' కథా సంకలనం ఈ ఏడాది పురస్కారానికి ఎంపికైంది. 1979 నుంచి బాల సాహిత్యంలో కథలు, కథానికలు, నాటికలు ఎన్నింటినో ఆయన రచించారు. పురపాలక సంఘ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించిన భీమేశ్వరరావు... తెలుగు సాహిత్యంలో స్నాతకోత్తర పట్టాను పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకోవటంతో... జిల్లాలోని కవులు కళాకారులు సాహితీవేత్తలు అభినందించారు.
గతంలోనూ ఆయన పలు పురస్కారాలు అందుకున్నారు. 2002లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా భీమేశ్వరరావు గుర్తింపు పొందారు. 2017లో భరద్వాజ కళాపీఠం సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం బాలసాహిత్య కీర్తి పురస్కారం అందుకున్నారు.