Land Allotment to Minister Botsa Family at Low Cost: విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఏపీఐఐసీ గ్రోత్ సెంటర్‌లో.. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన సత్య బయో ఫ్యూయల్స్ సంస్థకు ప్రభుత్వం.. కారుచౌకగా 30 ఎకరాలు కట్టబెట్టింది. ఏపీఐఐసీ లెక్కల ప్రకారమే ఇక్కడ ఎకరం ధర దాదాపు 82 లక్షలు ఉండగా.. బొత్స కుటుంబానికి 10 లక్షలకే ధారాదత్తం చేసింది. మంత్రి బొత్స సోదరులు సతీష్‌కుమార్, ఆదినారాయణ డైరెక్టర్లుగా ఉన్న ఆ కంపెనీ ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన భూమిలో డిస్టిలరీ, ఇథైల్ ఎసిటేట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో తయారుచేసే ఇథనాల్‌ను మద్యం ఉత్పత్తిలోనూ, ఫార్మా తదితర పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు.
ఈ పరిశ్రమలకు భూములను కేటాయింపునకు సంబంధించి జులై 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. తక్కువ ధరకే భూమి కేటాయించిన ప్రభుత్వం మంత్రి బొత్స కుటుంబానికి 21.56 కోట్ల అనుచిత ప్రయోజనం చేకూర్చింది. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌కు చుట్టుపక్కల బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి ధర 2 నుంచి 3 కోట్ల వరకు ధర పలుకుతోంది. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంలో తప్పులేదు కానీ.. మంత్రి కుటుంబానికి చెందిన సంస్థకు ప్రభుత్వ విధానం ప్రకారం నిర్ణయించిన ధర కన్నా తక్కువకే భూములు కట్టబెట్టడంపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థకు 4 వేల 827 ఎకరాల భూ కేటాయింపు
మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు ప్రక్రియ ఆఘమేఘాలమీద పూర్తి చేసింది. రాయితీపై భూమి కేటాయించాల్సిందిగా ఆ సంస్థ సీఈవో ఈ ఏడాది జూన్ 21న ముఖ్యమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేయగా.. అయిదు రోజుల్లోనే సీఎం కార్యదర్శి దాన్ని పరిశ్రమలశాఖకు పంపారు. ఆ పరిశ్రమకు వేగవతి నది నుంచి నీటిని కేటాయిస్తూ మరుసటి రోజే జలవనరులశాఖ జీవో జారీ చేసింది. జులై 10న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో.. ఆ కంపెనీకి భూమి కేటాయింపునకు సిఫారసు చేశారు. జులై 11న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన పరిశ్రమల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై 27న జీవో ఇచ్చేశారు.
కారుచౌకగా భూమిని కేటాయించడమేగాక మంత్రి కుటుంబ సంస్థకు ఇతరత్రా ప్రయోజనాలను ప్రభుత్వం కల్పించింది. సత్య బయో ఫ్యూయల్స్ సంస్థ 235 కోట్లతో రోజుకు 200 కిలో లీటర్ల ఉత్పాదక సామర్థ్యంతో ‘గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ ప్లాంట్, 14.70 కోట్లతో ‘ఇథైల్ ఎసిటేట్ ప్లాంట్’ ఏర్పాటు చేయనుంది. దీనికోసం వేగవతి నది నుంచి రోజుకు లక్షా 60వేల లీటర్ల నీటిని ఇథనాల్ తయారీ కోసం కేటాయించారు. వెయ్యి లీటర్ల నీటిని కేవలం 5 రూపాయలకే ఇవ్వనున్నారు.