విజయనగరం జిల్లాలో గ్రామస్థాయిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుపై సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్.. జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సంస్థలతో చర్చించారు. కొన్నిచోట్ల గ్రామస్థులు కొవిడ్‌తో బాధ పడుతున్నప్పటికీ, వివిధ కారణాలతో కొవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లడానికి విముఖత చూపిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్‌లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల.. వారి నుంచి ఇతరులకు వ్యాధి వ్యాపిస్తోంది.
ఈ కారణంగా 25 శాతం పాజిటివిటీ ఉన్నగ్రామాల్లో, స్థానికంగానే ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. స్థానికంగానే ఉండేందుకు గ్రామస్థులు ఎక్కువగా ఇష్టపడుతుండటం వల్ల, వారిని స్థానిక ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, ఇతర ప్రభుత్వ భవనంలో 20 నుంచి 40 పడకలతో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అన్ని వసతులను ప్రభుత్వమే కల్పిస్తుందని, నిర్వహణ బాధ్యతలను మాత్రం ఎన్‌జీఓలు చూడాల్సి ఉంటుందన్నారు. దీనికోసం ఒక్కో మండలానికీ ఒక్కో స్వచ్చంద సంస్థను నోడల్ ఎన్‌జీఓగా ఎంపిక చేస్తామన్నారు.
పడకలు, మందులు, వైద్య సహాయాన్ని తామే అందిస్తామని, భోజనం, పారిశుద్ధ్యం, నిర్వహణ మాత్రమే ఎన్‌జీఓలు చూడాల్సి ఉంటుందన్నారు. అత్యవసర సమయంలో ఆక్సిజన్, అంబులెన్సులను కూడా పంపిస్తామన్నారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. మండల స్థాయి అధికారులైన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్యాధికారులు, స్థానికంగా గ్రామ సర్పంచ్‌లు, ఇతర ప్రభుత్వసిబ్బందిని సమన్వయం చేసుకొని, ఈ కేంద్రాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు తమకు అనుకూలమైన మండలాలను ఎంపిక చేసుకొని తమ సంసిద్ధతను తెలియజేయాలని జేసీ కోరారు.
ఇదీ చదవండీ..ప్రధాని మోదీకి అమరావతి రైతుల లేఖ