ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలపై నేరాలు పెరిగిపోతున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి అన్నారు. కొన్ని సంఘటనలు మరీ అసభ్యకరంగా ఉంటున్నాయని విచారం వ్యక్తం చేశారు. వీటి పట్ల సమాజం ఆలోచించాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కోర్టు సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా, పోక్సో కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. హైకోర్టు ఇతర న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ చీకటి మానవెంద్రనాథ్ రాయ్, విజయనగరం జిల్లా కోర్టు న్యాయమూర్తి గోపితో కలసి.. కోర్టులను ప్రారంభించారు. అనంతరం ప్రారంభోత్సవ సభలో జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రసంగించారు.
రెండు నెలల క్రితమే ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చాను. విజయవాడ వెలుపల ఇదే నా తొలి పర్యటన. బార్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఇక్కడి కార్యక్రమంలో పాలుపంచుకున్నాను. నలభై సంవత్సరాలుగా ఏ చీఫ్ జస్టిస్ విజయనగరం కోర్టును సందర్శించలేదని చెప్పారు. అందుకే, విజయనగరానికి వస్తానని వారికి మాట ఇచ్చాను. మరో రెండు రోజుల్లో జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ మహిళా కోర్టు ప్రారంభించటం సంతోషంగా ఉంది. ఇందుకు కృషి చేసిన వారి అభినందనలు. - జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పోస్కో, మహిళా కోర్టుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గోస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకు ముందు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ప్రస్తావించిన విజయనగరం బార్ అసోసియేషన్ సమస్యలపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థలో సమస్యలు తెలుసన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల కాలంలో పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. వీటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని జస్టిస్ గోస్వామి హామీ ఇచ్చారు. అనంతరం హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు ఇతర న్యాయమూర్తులను విజయనగరం జిల్లా కోర్టు న్యాయమూర్తి గోపి, బార్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు.
ఇదీ చదవండి: మార్చి 15 నుంచి సుప్రీంలో భౌతిక విచారణ