రచనలతో సాంఘిక దురాచాలపై పోరాటం సాగించిన మమహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు విజయనగరంలోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అక్కడనుంచి సత్య లాడ్జి వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహం వరకు ప్రజాప్రతినిధులు, సాంస్కృతిక సంఘాలు, సాహితీవేత్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంగీత కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్ అనే గేయాన్ని ఆలపించారు. శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య, శంబంగి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, జిల్లా కలెక్టర్ డా. హరిజవహర్ లాల్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను తీసుకొని వాడుక భాషలో అనేక రచనలను చేసిన మహాకవి గురజాడ అని రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సంఘాలు, సాహితీవేత్తలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.