విజయనగరం కలెక్టరేట్లో
మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్. హరిజవహర్‌లాల్ అన్నారు. రాష్ట్రంలో ఏడాది కిందట గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని.. దీని ద్వారా ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో జరిగిన గాంధీ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విజయనగరం పట్టణంలో...
నగరంలోని ఐఎంఏ హాలులో వార్డు సచివాలయం ఉద్యోగులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రక్తదానం చేసిన సచివాలయ సిబ్బందిని ఆయన అభినందించారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సాలూరు పట్టణంలో...
సాలూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గాంధీ జయంతి సందర్భంగా తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి , మాజీఎమ్మెల్యే ఆర్పీ భాన్జుదేవ్లు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి ఎంతో సేవచేశారని ఆమె కొనియాడారు.
సాలూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద గాంధీ విగ్రహానికి వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొర పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారని... వాలంటీర్ సేవలు అందిస్తున్నారని కొనియాడాడు. గిరిజనుల అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
చీపురుపల్లిలో..
చీపురుపల్లి గ్రామ సచివాలయంలో గాంధీ జయంతి పురస్కరించుకుని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నివాళులు అర్పించారు. స్వతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ పోషించిన పాత్ర నేటి తరాలకు ఆదర్శమని ఆయన అన్నారు.
ఇదీ చూడండి.
గిరిజనులకు భూపట్టాల పంపిణీ.. హామీ నిలబెట్టుకున్నామన్న సీఎం