Farmers Protest Against Highway: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర మీదుగా నిర్మిస్తున్న విశాఖ-అరకు జాతీయ రహదారి బైపాస్ కోసం వ్యవసాయ భూములను తీసుకోవద్దని కోరుతూ బాధిత రైతులు ధర్నా చేపట్టారు. అఖిల భారత కిసాన్ సంఘం, పెందుర్తి-బొడ్డవర హైవే భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రహదారి కోసం తమ భూములను తీసుకోవద్దని, అంతంత మాత్రంగా మిగిలిన పొలాలను తీసుకుని తమ పొట్టకొట్టొద్దంటూ నిరసనలు చేపట్టారు. రహదారి విస్తరణకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలంటూ.. ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
Farmers Protest: రహదారిపై రైతుల ధర్నా.. ఎంపీ బ్రహ్మానందరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకొని
అనంతరం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విశాఖ-అరకు జాతీయ రహదారి NH-516Bకి విజయనగరం జిల్లాలో.. కొత్తవలస, వేపాడ, ఎస్.కోట, ఎల్.కోట మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల రైతుల నుంచి భూసేకరణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ గ్రామాల్లో ఇప్పటికే గ్యాస్ లైన్, పలు రకాల జాతీయ రహదారులతో పాటు.. సుజల స్రవంతి, పోలవరం కాల్వల తవ్వకాలకు రైతుల భూములు సేకరించారు. తిరిగి విశాఖ-అరకు జాతీయ రహదారి NH-516B కోసం మరోసారి అధికారులు భూసేకరణకు భూములను గుర్తిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అరకొరగా మిగిలిన భూముల్లోనూ మరోసారి భూ సేకరణ చేస్తే.. రైతులు ప్రధాన జీవనాధారం కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు ఉద్యమబాట పట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.
Farmers Protest: 'పంట ఎండిపోతోంది.. కాస్తా కనికరించండి సారూ'
"విజయనగం జిల్లాలో.. కొత్తవలస మండలం చింతలపాలెం రెవెన్యూ మొదలుకొని ఎస్.కోట మండలం తెన్నుపాటు వరకు కూడా బైపాస్ రోడ్డు విస్తరించాలని అధికారులు అనుకుంటున్నారు. జాతీయ రహదారి అనే పేరుతో ఇప్పుడు అక్కడ రోడ్డు వేయాలని అనుకుంటున్నారు. దీన్ని ఆ ప్రాంతంలోని రైతులమంతా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే.. ఇప్పటికే కొత్తవలస, ఎస్.కోట, ఎల్.కోట మండలాల్లో.. గ్యాస్ పైప్ లైన్, పోలవరం కాలువ లాంటి రకరకాల పేర్లతో ఇప్పటికే రైతుల భూములు సేకరించారు. మళ్లీ ఇప్పుడు బైపాస్ రోడ్డుతో భూములు సేకరిస్తే.. మేము తీవ్రంగా నష్టపోతాము. పచ్చని పంట పొలాలను ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ప్రజాభిప్రాయం సేకరించి దీనిపై ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము." - అప్పలరాజు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
"ఈ రోజు పెందుర్తి నుంచి బొడ్డవరంకు జాతీయ రహదారి NH-516B ప్రతిపాదన కింద రాళ్లను పాతారు. ఈ ప్రాంతమంతా కోట్లు విలువ చేస్తుంది. తప్పనిసరైతే ప్రభుత్వం.. బాధితులకు గజాల చొప్పున పరిహారం అందించాలి. 2013 చట్టం ప్రకారం బాధితులకు నాలుగురెట్లు పరిహారం అందించాలి. లేనిపక్షంలో మేము పోరాటం చేసి దీన్ని అడ్డుకుని తీరతాం." - చల్లా జగన్, హైవే భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్
Land Issues: భూముల్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. రోడ్డెక్కిన అన్నదాతలు