ASHOK GAJAPATIRAJU COMMENTS ON BHOGAPURAM AIRPORT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక.. గత ప్రభుత్వ హయాంలో పోర్టులకు, పరిశ్రమలకు, విమానాశ్రయాలకు జరిగిన శంకుస్థాపనలకు మళ్లీ జగన్ రెండోసారి శంకుస్థాపనలు చేయటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రేపు సీఎం జగన్.. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్..శంకుస్థాపన చేయటం విడ్డూరంగా ఉంది.. అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ..''భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శంకుస్థాపన చేయటం విడ్డూరంగా ఉంది. ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు..?. ఒక పనికి పలుమార్లు శంకుస్థాపన చేయటం ఈ వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుంది. భోగాపురం విమానాశ్రయానికి సీఎం శంకుస్థాపన చేయనున్న కార్యక్రమానికి.. వీడియో, ఫొటోగ్రాఫ్‌లు, మీడియాను అనుమతి లేకపోవడం మరో గమ్మత్తుగా ఉంది. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ కనెక్టివిటి పెంచేందుకు స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ఆనాడు భోగాపురం విమానాశ్రయానికి సంకల్పించాం. అయితే.. ప్రభుత్వం మారటంతో విమానాశ్రయ నిర్మాణం వెనక్కి వెళ్లిపోయింది'' అని ఆయన అన్నారు.
మరోసారి శంకుస్థాపన చేయలేదు.. అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టుని టీడీపీ ప్రతిపాదించగా.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అది పూర్తయిందన్నారు. కానీ, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత రాజశేఖర్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి శంకుస్థాపన చేయలేదని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు, ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను కూడా ఆపలేదన్నారు. కానీ, భోగాపురం విమానాశ్రయం విషయంలో ఆ విడ్డూరం చోటు చేసుకుందని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండో దఫా విమానాశ్రయానికి శంకుస్థాపన చేయటం.. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో వైసీపీ మంత్రులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని.. గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి.. ఉత్తరాంధ్ర ప్రజలు ఆకాంక్షను నెరవేర్చాలని కేంద్ర విమానాయన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచించారు.
500 ఎకరాలను తగ్గించటం దారుణం.. గత సంవత్సరం భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం సేకరించిన భూములను వైసీపీ ప్రభుత్వం తగ్గించటంపై.. మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం 2,700 ఎకరాల భూమిని సేకరిస్తే.. దానిని వైసీపీ ప్రభుత్వం 500 ఎకరాలను తగ్గించటం దారుణమన్నారు. ఆనాడూ తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఎకరాకు రూ. 17 లక్షల నుంచి రూ. 35 లక్షలు వరకు ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఆ భూములకు కోట్ల రూపాయల ధర పలుకుతుండడంతో జగన్ ప్రభుత్వ పెద్దలు ఆ భూములతో వ్యాపారం చేస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను ఆలస్యం చేయడమే కాకుండా.. ఇప్పుడు భూమిలో కోత పెట్టడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజున సీఎం జగన్ మరోమారు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు, ఆదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
ఇవీ చదవండి