విజయనగరం జిల్లాలో పోలీసు శాఖ దత్తత తీసుకున్న పాఠశాలలకు అవసరమైన సామగ్రిని జిల్లా ఎస్పీ బీ.రాజకుమారి అందించారు. స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ వ్యవస్థ కింద కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, స్కానర్లు, కుర్చీలు, పెన్‌డ్రైవ్‌లు మొదలగు పరికరాలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో ఎస్పీసీ అనేది ఒక పవిత్రమైన కార్యం అన్నారు. విద్యతో సంస్కారవంతులుగాను, మానవతా విలువలు కలిగిన వ్యక్తులుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఉద్ఘాటించారు. వక్రమార్గం పడుతున్న టీనేజీ విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీసీ పాఠశాలలను సంబంధిత ఎస్ఐ వారంలో ఒకసారి సందర్శించి విద్యార్థులతో మమేకమవుతారని ఎస్పీ చెప్పారు. దీని వల్ల పిల్లలు చెడు స్నేహాలు పట్టకుండా ఉంటారన్నారు. టెక్నాలజీని మంచి పనులకు వినియోగిస్తే విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, పోలీసులదే అని ఉద్ఘాటించారు.
ఇవీ చదవండి...