గిరిశిఖర గ్రామాల్లో గర్భిణులకు వైద్య సదుపాయాలు అందటంలో నేటికి విఘాతాలు ఎదురవుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణ శివారు రేగ పుణ్యగిరి గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి వంతల శాంతికి తెల్లవారుజామున నొప్పులు రావడంతో భర్త, బంధువులు డోలీ కట్టి ఆరు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వచ్చారు. సమాచారం తెలిసిన ఆరోగ్య సహాయకులు శంకర్రావు, ఎఎన్ఎం రమణమ్మ నడుచుకుంటూ వెళ్లి సగం దూరంలో తనిఖీ చేశారు. ఆరోగ్య సహాయకుడు శంకర్రావు డోలీకి ఒకవైపు భుజం కాసి మోసుకుంటూ తీసుకువచ్చి పుణ్యగిరి గ్రామం వద్ద 108అంబులెన్స్ ఎక్కించారు.
గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని సీపీఎం నాయకుడు మద్దిల రమణ, గిరిజన సంఘం నాయకుడు గౌరీష్ ఆరోపించారు. గిరిజన గర్భిణులు ప్రాణాలు గాల్లో కలసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వాపోయారు. గర్భిణీ శాంతిని ఎస్.కోట సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈనెల 9న ఈమెకు సామాజిక ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. ఈనెల 22న ప్రసవం జరగవచ్చని వైద్యులు అంచనా వేశారు. అయితే ఈమెను ముందే ఆసుపత్రిలో చేర్పించమని సూచించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందన్నారు.
ఇదీ చదవండీ.. ARREST: నకిలీ చలానాల కేసులో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు అరెస్ట్