విజయనగరం జిల్లాలో చాలా గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. ఆస్పత్రికి పోవాలంటే.. ఎన్నో అవస్థలు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరు మండలం సిరివర గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన మెల్లక అలుసు అనే వ్యక్తికి వారం రోజులుగా కడుపు నొప్పి. స్థానికంగా వైద్యం అందించినా.. తగ్గకపోవటంతో బుధవారం అతన్ని డోలీలో తీసుకెళ్లారు. ఏకంగా 15 కిలోమీటర్లు డోలీలో మోసి.. ఆసుపత్రికి తరలించారు.
అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం.. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లాలని రోగి బంధువులకు సూచించారు. 108 వాహనం అందుబాటులో లేక కుటుంబీకులు బాధితుల్ని బస్సులో పార్వతీపురం తీసుకొచ్చారు. బస్సు దిగాక ఆసుపత్రికి బాధితుడిని.. అతని అల్లుడు మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
2 వారాల క్రితం పార్వతి అనే మహిళ ఆరోగ్యం బాగా లేకపోవడంతో డోలీలోనే ఆసుపత్రికి తరలించామని గ్రామస్తులు తెలిపారు. గర్భిణీలను కూడా డోలీలోనే తరలించాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.