విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ ప్రకటన జారీ చేసిందని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన విధంగానే మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అలాగే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం నగరానికి వచ్చి తమ ఓటు వేయాలని సూచించారు.
రేపటి పోలింగ్‌కు ఏర్పాట్లు..
జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా విజయనగరం డివిజన్లోని 9 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు హరిజవహర్ లాల్ వెల్లడించారు. 9 మండలాల పరిధిలో, 248 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 37 పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి. ఇందుకోసం 2030 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విడతలో 3 లక్షల 60 వేల 181 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఇప్పటికే 16,887 మందిపై ముందోస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేసామని ఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి...