గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ పూర్తైన జీ ప్లస్ త్రీ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే స్వాధీనం చేయాలని సీపీఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లను పేదలకు ఇస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం.. నేడు మాట మార్చిందని ఆరోపించారు. పార్టీ ఆధ్వర్యంలో... విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 21వ డివిజన్లో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రూ. 155 కోట్లతో ఇళ్లు పూర్తి చేశారు. అయితే లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం 18 నెలలుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఇప్పటికైనా పూర్తైన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. లేనిపక్షంలో పార్టీ నేతృత్వంలో లబ్ధిదారులతో ఈ నెల 16న ఇళ్ల స్వాధీనం చేసుకునే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమితి సభ్యులు టి.జీవన్, మర్క్స్ నగర్ కార్యదర్శి అప్పురుబోతు జగన్నాధం, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: