విజయనగరం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట, సాలూరు, మక్కువ, మెంటాడ మండలాల్లో వారానికి 27 కూడళ్లలో సంతలు జరుగుతాయి. వీటిల్లో పెద్దసంతలుగా చెప్పుకోదగ్గవి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, గొరడ, మొండెంఖల్లు, కూనేరు, దుగ్గేరు, బట్టివలస సంతలు. ఈ సంతలపై ఆధారపడే సగటు వ్యాపారుల సంఖ్య 200 మంది కాగా, గిరిజనుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులు ఒక్కో సంతలో 300 మంది వరకు ఉంటారు.
గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ సంతకు... దాదాపు 30 గ్రామాల నుంచి రెండువేల మందికి పైగా వస్తారు. సుమారు 5 లక్షల రూపాయల వ్యాపారం సాగుతుంది. చింతపండు సేకరణ కాలంలో వ్యాపారం లక్షల్లో ఉంటుంది. ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఈ సంతల్లో సరకులు కొనుగోలు చేస్తుంటారు.
ప్రధాన వ్యాపార కేంద్రం
కొమరాడ మండలం కూనేరులో ప్రతి శనివారం సంత నిర్వహిస్తారు. ఇక్కడ 10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. చింతపండు, కొండ చీపురు, పనస పండ్లు, ఉసిరికాయలు వంటి అటవీ ఉత్పత్తులకు ఇది ప్రధాన కేంద్రం. గిరిజనులు తమకు అవసరమైన నిత్యావసరాలను వ్యాపారుల నుంచి కొనుగోలు చేసుకొంటారు.
ఇవే సూపర్ బజార్లు
ఒడిశాలోని సికెల, కొరడా, వనిజ తదితర ప్రాంతాల నుంచి గుమ్మలక్ష్మీపురం మండలంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఈ సంత ప్రధాన వనరు. గిరిజన ప్రాంతాల్లో సూపర్ బజారుల వెలుగొందుతున్న ఇలాంటి సంతలపైనా కరోనా ప్రభావం చూపింది. కొవిడ్-19 ఆంక్షలతో గత రెండు నెలలుగా ఈ సంతలు జరగలేదు. గిరిజనుల వద్ద అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసి వ్యాపారులు కూడా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు.
సమీప కూడళ్లలో సంతలు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజనులు పండించే ఉత్పత్తులు విక్రయించుకునే పరిస్థితి లేదు. వీరికి కావాల్సిన సరకులు తెచ్చుకోలేకపోతున్నారు. కొందరు యువకులు పట్టణాలకు ఆటోలపై వెళ్లి సరకులు తీసుకువెళ్తున్నారు. సాధారణంగా సంతల్లో ధర కంటే రూ.5, రూ.10 ఎక్కువ వెచ్చిస్తే తప్ప వీరికి సరకులు దొరకని పరిస్థితి. నెలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే నిత్యావసర వస్తువుల కోసం జీసీసీ డిపోలకు వెళ్లేటప్పుడు కొన్ని సరకులను డిపోల్లో కొనుక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
గిరిజనులు.. వేసవిలో మామిడి తాండ్ర, తియ్యరుగు, మామిడి పండ్లు అమ్ముకుని నాలుగు పైసలు వెనకేసుకునేవారు. ప్రస్తుతం సంతలు జరగకపోటవం, అటవీ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లభించక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అటవీ ఉత్పత్తులు సేకరించి సంతల్లో అమ్ముకుని ఆదాయం చేసుకునే గిరిజనులను.. కరోనా తీవ్రంగా దెబ్బతీసింది.
ఇదీ చదవండి : రంగుల ఖర్చును వైకాపా నుంచే రాబట్టాలి: చంద్రబాబు