గంపెడు భారాన్ని మోసుకుంటూ కొండ కోనలు దాటుతుంటారు గిరిపుత్రులు. విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట, సాలూరు, మక్కువ, మెంటాడ మండలాల్లో జరిగే వారపు సంతలకు అటవీ ప్రాంతం నుంచి ఉత్పత్తులు తెచ్చి విక్రయిస్తుంటారు. వీరిపై కరోనా ప్రభావం పడింది. ఈ సంతలకు గతంలో సగటున 200 మంది వ్యాపారులు వచ్చి.. గిరిజనుల ఉత్పత్తులు కొనే వారు. చింతపండు సేకరణ కాలంలోనైతే వ్యాపారం లక్షల్లోనే జరిగేది. ప్రస్తుతం.. పరిస్థితి తారుమారైంది.
కరోనా భయంతో కొన్ని సంతలు రద్దు చేయగా నిర్ణీత కాలంలో పెడుతున్న సంతలు కొనుగోళ్ల కళ తప్పాయి. కిలోమీటర్లకొద్దీ మోసుకొచ్చిన కొండ చీపుర్లు, పనస పండ్లు, ఉసిరికాయలు , చింతపండు కొనే వారే కరవయ్యారని గిరిపుత్రులు వాపోతున్నారు. కొమరాడ మండలం కూనేరులో ప్రతి శనివారం జరిగే సంతకు గతంలో భారీగా జనం వచ్చే వారు. కొవిడ్ నిబంధనలు, కర్ఫ్యూ ఆంక్షలతో ప్రస్తుతం ఆ సంత వెలవెలబోతోంది.
ఈ ప్రభావం అటవీ ఉత్పత్తులు తీసుకొని గిరిపుత్రులకు సరుకులు ఇచ్చే వ్యాపారాలపైనా పడింది. నెలరోజులుగా బేరాల్లేక నష్టపోతున్నామని అంటున్నారు వ్యాపారులు. సంతల్లో కొనుగోళ్లు జరగకపోవడం వల్ల గిరిజనులకు.. రోజు గడవడం కష్టంగా మారుతోంది. సరకులు తెచ్చుకొనేందుకు పైసల్లేక ఇబ్బంది పడుతున్నారు. అటవీ ఉత్పత్తులు అమ్మి.. 4 రూపాయలు వెనకేసుకునే కాలంలోనే కరోనా దెబ్బతీసిందని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 5 మరణాలు.. పెద్దసంఖ్యలో కేసులు