విజయనగరం జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 31 స్థానాలకు ఈనెల 8న ఎన్నికలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వివరాలను వెల్లడించారు.
జడ్పీటీసీ స్థానాలకు..
31 జడ్పీటీసీ స్థానాలకు 129 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో వైకాపా నుంచి 31 మంది, తెదేపా నుంచి 28, కాంగ్రెస్ నుంచి 25, భాజపా నుంచి 14, బీఎస్పీ నుంచి 4, జనసేన 10 మంది.. సీపీఎం నుంచి 3, స్వతంత్రులు 14 మంది పోటీలో ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు.
ఎంపీటీసీ స్థానాలకు..
ఇక 549 ఎంపీటీసీ స్థానాలకు గాను 55 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 494 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ స్థానాలకు 1189 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో వైకాపా నుంచి 491మంది, తెదేపా నుంచి 453, కాంగ్రెస్ నుంచి 29, భాజపా నుంచి 34, బీఎస్పీ నుంచి 12, జనసేన 24 మంది, సీపీఎం నుంచి 20, సీపీఐ నుంచి ఇద్దరు, స్వతంత్రులు 123 మంది పోటీలో ఉన్నారు. 8 స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు మృతి చెందడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ కేంద్రాలు...
జిల్లాలో ఎన్నికల కోసం 1879 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాధారణ ఎన్నికల పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి కాంతి లాల్ దండే వ్యవహరించనున్నారు. ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించడానికి 218 బస్సులు, 214 క్యాబ్‌లు, 161 కార్లు వినియోగిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
భద్రత ఏర్పాట్లు..
213 సెన్సిటివ్, 183 హైపర్ సెన్సిటివ్, 99 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరిగేలా, ఓటర్లు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టామన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలా సహకారం అందించారో.. ప్రాదేశిక ఎన్నికలకు కూడా అలాగే సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి...