విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోలు దాడి ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉండాలన్నారు. బాధితురాలికి అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలిని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. యువతితో మాట్లాడిన మంత్రులు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.
'క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. బాధితులను విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆస్పత్రికి తరలిస్తున్నాం.దిశ యాప్ వల్లే బాధితులను సకాలంలో కాపాడగలిగాం. పోలీసులు వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు' - మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ
ఏం జరిగిందంటే..?
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి.. గాయాలయ్యాయి. ముగ్గురినీ విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నరవకు చెందిన రాంబాబుగా గుర్తించారు. రాంబాబు, బాధిత యువతి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకరించాయి. అయితే ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందంటూ రాంబాబు పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించాడు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి
CURFEW EXTEND: సెప్టెంబర్ 4వ తేదీ వరకు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు