CBN VIZIANAGARAM TOUR : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ ఇటీవల "ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి" కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు పలు గ్రామాల్లో పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన తీరుని ప్రజలకు తెలియచేస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు విజయనగరం జిల్లాలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటన తొలి రోజు హైదారాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజాం సరిహద్దు పొగిరి చేరుకుంటారు.
రాజాంలోని మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ : పొగిరి వద్ద ఆయనకు జిల్లా, స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి చిలకపాలెం, రాపాక కూడలి, పొందరూ మీదుగా వీ.ఆర్. అగ్రహారం చేరుకుని ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి నుంచి చైతన్య జూనియర్ కళాశాల మీదుగా పట్టణంలోని ప్రధాన మార్గంలో రోడ్డు షో నిర్వహిస్తారు. రోడ్ షో ముగిశాక.. రాజాంలోని మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 8గంటలకు., రాజాంలోని ఆర్సీఎం చర్చిలో జరిగే సెమి క్రిస్మస్ వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆ తర్వాత తృప్తి రిసార్ట్‌లో బస చేయనున్నారు.
23న తృప్తి రిసార్ట్‌లో ఓబీసీ నేతలతో సమావేశం: రెండో రోజు పర్యటనలో భాగంగా 23న.. 11 గంటలకు రాజాంలోని తృప్తి రిసార్ట్‌లో ఓబీసీ నాయకులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బొబ్బిలిలో పర్యటించనున్నారు. టెక్కలివలస, కంచరం మీదుగా 2 గంటలకు పెరుమాళి చేరుకుంటారు. అక్కడి నుంచి వెలగవలస, తెర్లాం ఎక్స్‌రోడ్డు, గంగన్నపాడు, నందిగాం, రాజేరు, పెనపింకి, కారాడా మీదుగా ద్విచక్ర వాహన ర్యాలీతో సాయంత్రం 4.30 గంటలకు బొబ్బిలి మండలం గొల్లపల్లికి చేరుకుంటారు. 5.30 గంటలకు బొబ్బిలి చర్చి సెంటర్ నుంచి ఓంకార్ చెరువుగట్టు, చాకలి వీధి కూడలి వరకు రోడ్‌షో లో పాల్గొంటారు. అనంతరం.. 6.30 గంటలకు బొబ్బిలి కళాభారతి వాటర్ ట్యాంకు వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం బొబ్బిలి ప్యాలెస్ చేరుకుని రాత్రి బస చేస్తారు.
24న బొబ్బిలి ప్యాలెస్‌లో రైతులతో సమావేశం: మూడో రోజు పర్యటనలో భాగంగా 24 వ తేదీ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు బొబ్బిలి ప్యాలెస్‌లోని దర్బార్ మహల్లో రైతులతో సమావేశం కానున్నారు. అనంతరం విజయనగరం పర్యటన నిమిత్తం బయలుదేరుతారు. రామభద్రపురం, గజపతినగరం, బొండపల్లి మీదుగా సాయంత్రం 4.30 గంటలకు విజయనగరం చేరుకుంటారు. అక్కడి నుంచి కేఎల్ పురం, వెంకటలక్ష్మి థియేటర్ కూడలి, గంట స్తంభం మీదుగా కోట వద్దకు రోడ్ షో గా విజయనగరం కోట వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ అనంతరం.. రోడ్డు మార్గాన విశాఖపట్నం చేరుకుంటారు.
ఇవీ చదవండి: