విజయనగరం జిల్లాలో జీడి మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులు... తెగుళ్లతో ఇక్కట్లు పడుతున్నారు. ఐటీడీఏ పరిధిలోని 8 మండలాల్లో సుమారు 64 వేల ఎకరాల్లో రైతులు జీడిపంట సాగు చేస్తున్నారు. పంట తొలిదశలో బాగానే ఉన్నా... రానురాను తెగుళ్లు అధికమయ్యాయని రైతులు వాపోతున్నారు. టీ దోమ తీవ్రంగా నష్టపరుస్తోందని... ఇప్పటికే తోటల్లో 80 శాతం మేర పూత, పిందె రాలిపోయిందని ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ తదితర మండలాల్లో జీడీ మామిడి సాగు ఎక్కువగా ఉంది. జీడీ మామిడి జీవనాధారంగా ఉండే ఇక్కడి గిరిజన రైతులు ఈ ఏడాది తోటల సాగుకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ప్రకృతి వైపరీత్యాలతో రెండేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న రైతులు.. ఈ ఏడాదైనా మంచి దిగుబడులు వస్తాయని ఆశపడ్డారు. తెగుళ్లు తీవ్రంగా విజృంభించడంతో ప్రస్తుతం పెట్టుబడులు కూడా తిరిగి రావని ఆందోళన చెందుతున్నారు. ఏటా వేసవి కాలంలో జీడిపండు గుబాళింపుతో నిండిపోయే ఈ ప్రాంతమంతా... ఈ ఏడాది కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: