Airport Punaravsa colony's విజయనగరం జిల్లా భోగాపురంలో.. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి గత ప్రభుత్వం తొలుత అనుకున్న 2వేల200 ఎకరాలతోపాటు అదనంగా మరో 500 ఎకరాలు సేకరించింది. దానికి మరడపాలెం, ముడసర్లపేట, రెల్లిపేట, బొల్లింకలపాలెం వాసులు భూములిచ్చారు. ఆయా గ్రామాల్లో చాలామంది పొట్ట కూటి కోసం విశాఖ, కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ సొంతూరొచ్చి వెళ్తుంటారు. రేషన్, ఇతర పథకాల కోసం ప్రతీ నెలా తిరగడం ఎందుకనే ఉద్దేశంతో చాలా మంది రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డులను వలస వెళ్లినచోటికి బదిలీ చేయించుకున్నారు. ఇప్పుడు ఇదే వారిపాలిట శాపమైంది.
స్థానికులని చెప్పేందుకు వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవంటూ.. వలసవెళ్లిన వాళ్లను నిర్వాసితులుగా అధికారులు గుర్తించడంలేదు. ఊరు వదిలి వెళ్లే సమయంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ పరిహారం, పునరావాస ప్యాకేజ్ ఇస్తామని నమ్మబలికిన అధికారులు.. ఇప్పుడు మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సూర్యకుమారిని కలిసి వినతి పత్రం అందించినా ఫలితం లేదన్నారు.వలసవెళ్లిన నిర్వాసితుల బాధ ఇలా ఉంటే ఊళ్లోనే ఉన్నవాళ్లది మరో కష్టం. మరడపాలెంలో 223,ముడసర్లపేటలో 33, బొల్లింకలపాలెంలో 55, రెల్లిపేటలో 65 నిర్వాసిత కుటుంబాలను ఖాళీ చేయించాల్సి ఉంది. వారి కోసం గూడెపువలస, లింగాలవలసలో పునరావాసకాలనీలు నిర్మిస్తున్నారు. ఆయా కాలనీలో 70శాతం పనులే పూర్తయ్యాయి. వచ్చే జనవరికిగానీ మిగతా పనులు పూర్తయ్యేలాలేవు.
ఐనాగానీ గ్రామాలు ఖాళీ చేయాలంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. గూడెపువలస నిర్వాసిత కాలనీలో కాలువలు, శ్మశానవాటిక, సామాజిక భవనం,ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ విమానాశ్రయ నిర్మాణ పనుల శంఖుస్థాపనకు సమాయాత్తమవుతున్న ప్రభుత్వం భూములు సేకరించిన గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు పంపింది. వలస వెళ్లిన వారికి, 18 ఏళ్లు నిండిన వారికి పునరావాస ప్యాకేజ్ ఇవ్వడంపై ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలని భోగాపురం తహసీల్దార్ చెప్తున్నారు. నిర్వాసితుల తరలింపులోనూ ఎలాంటి బలవంతం లేదని తెలిపారు. గుర్తింపుకార్డుల్లేవని పునరావాస ప్యాకేజ్ నిరాకరించడంపై.. కోర్టును కూడా ఆశ్రయించామని నిర్వాసితులు తెలిపారు.
ఇవీ చదవండి: