రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మొన్నటి వరకు ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారితో పాటు.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా పలు కార్యక్రమాలు అమలు చేసింది. తాజాగా డిగ్రీ విద్యార్థుల్లో సైతం సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే.. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అకడమిక్ తరగతులతోపాటు సాంకేతిక నైపుణ్యాలపై 3 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది.
డిగ్రీ విద్యార్థులకు తరగతుల నిర్వహణ కోసం అధికారులు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాంకేతికతకు సంబంధించిన అంశాలతోపాటు సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా డిగ్రీ విద్యార్థులు సైతం ఇంజినీరింగ్ వారితో సమానంగా ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో 7 వేల మంది డిగ్రీ విద్యార్థులకు ఈ తరహా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు.
హార్డ్వేర్ నెట్ వర్కింగ్, పైథాన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కోర్సులపై ఆన్లైన్లో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. అరిథమెటిక్, రీజనింగ్, సాఫ్ట్వేర్ స్కిల్స్ అంశాలపైన అవగాహన పెంపొందిస్తున్నారు. ఆఫ్లైన్లో 6 రకాల కోర్సుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆక్వా వెబ్ సర్వీసెస్, హార్డ్ వేర్ నెట్ వర్కింగ్, ట్యాలీ విత్ జీఎస్టీ, ఈ - కామర్స్ డిజిటల్ నెట్ వర్క్, ఫార్మా మార్కెటింగ్, ఎగ్జిం, డెబిట్ మార్కెటింగ్ అంశాలపై సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తాజాగా చేపట్టిన కార్యక్రమంపై అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తరగతులతో లబ్ధి పొందుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: