ఈ వీడియోలో సాధన చేస్తున్న వీరంతా.. సైన్యంలో, పోలీసు కొలువుల్లో చేరాలనుకునే ఔత్సాహికులు. అథ్లెట్లుగా జాతీయస్థాయిలో పతకాలు తీసుకురావాలనే లక్ష్యం కలిగిన వారు. ఇలాంటి వారందర్ని ఒక్కచోటుకి చేర్చి.. శిక్షణ ఇస్తున్నాడు..హేమంత్ కుమార్. శైలి చూస్తే కోచ్‌లా కనిపిస్తున్నాడు కానీ ఇతడు అంతకు మించి. ఓ వైపు ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తూనే.. సెలవుల విరామాన్ని విద్యార్థుల ఉన్నతికి కేటాయిస్తున్నాడు.
హేమంత్‌స్వస్థలం.. విజయనగరంజిల్లా చీపురుపల్లి మండలం పుర్రేయవలస. తను జాతీయ స్థాయి అథ్లెట్. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగం కోసం అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టువిడకుండా ప్రయత్నించి 2009లో కలల కొలువు సాధించాడు. అప్పుడే మదిలో ఓ ఆలోచన కలిగింది. ఉద్యోగంలో చేరక ముందు తాను పడ్డ కష్టాలు వేరెవరికి రాకూడదని భావించాడు. సన్నిహితుల సహకారంతో.. 2015 నుంచి నిరుద్యోగ యువతకు దేహదారుఢ్య పరీక్షల్లో ఉచిత శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడు.
90 రోజుల సెలవులను... వారి కోసమే..
హేమంత్ కుమార్‌కు ఏడాదిలో 90రోజులు అధికారక సెలవులుంటాయి. వాటిని సొంత కార్యక్రమాలకు కాక యువతకు శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తుండటం విశేషం. ఆ 90రోజులూ చీపురుపల్లిలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రోజూ ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు శిక్షణ ఇస్తుంటాడు.
హేమంత్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన వారిలో 80 మందికి పైగా యువతీయువకులు ఉద్యోగాలు సాధించారు. ఆర్మీ, ఎస్ఎస్సీ. జీడీ, సీఆర్‌ఫీఎఫ్, ఏపీ, తెలంగాణా పోలీసు డిపార్ట్‌మెంట్ తదితర విభాగాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతిభ చాటారు.
శిక్షణ మాత్రమే కాదు..
శిక్షణ మాత్రమే కాదు.. మిత్రులు, దాతల సహకారంతో పేద యువతకు అథ్లెట్ షూలు, డ్రెస్‌లు సమకూరుస్తున్నాడు హేమంత్. పేదల ఇంట్లో ఉద్యోగ వెలుగులు నింపాలనుకుంటున్న ఇతడి ప్రయత్నానికి సన్నిహితులు సైతం మద్దతు తెలుపుతున్నారు.
రాత పరీక్షలకు నిపుణులైన రచయితలు రాసిన పుస్తకాలు లభిస్తున్నాయి కానీ, ఫిజికల్ టెస్టులకు అలా కాదు. గ్రౌండ్‌లో ఉండి శిక్షణ ఇస్తేనే.. మంచి ఫలితాలు వస్తాయి. హేమంత్ తమకు దగ్గరుండి శిక్షణ ఇవ్వటంతో..తక్కువ కాలంలోనే మెరుగైన ప్రదర్శనలు ఇవ్వగల్గుతున్నామని విద్యార్థులు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో.. గ్రామీణ యువత నుంచి లక్షల రూపాయలు తీసుకుని మోసగిస్తున్న సంస్థలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో... నిరు పేద యువత కోసం.. సకల సదుపాయాలతో మంచి ఉచిత అకాడమీ ప్రారంభించాలన్నదే తన లక్ష్యమంటున్నాడు..హేమంత్ కుమార్.
ఇదీచదవండి: 'ఆ పేలుడు శక్తి.. వందల రెట్ల హిరోషిమా అణుబాంబులకు సమానం'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!