విజయనగరం జిల్లా కొత్తవలస స్త్రీ-శిశు సంక్షేమశాఖ కార్యాలయ సీడీపీఓ మనమ్మ, సీనియర్ సహాయకుడు వేణుగోపాల్ ఏసీబీ వలకు చిక్కారు. కొత్తవలస ఐసీడీఏ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయలు సరఫరా చేస్తున్న ఏజెన్సీ నిర్వహకుడు సురేష్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయనకు బిల్లుల మంజూరు కోసం 85వేల రూపాయలు వీరిరువురూ డిమాండ్ చేశారు. కూరగాయల ఏజెన్సీ నిర్వహకుడు గత మూడు నెలలకు సంబంధించిన రూ.4.60 లక్షల బిల్లుల మంజూరు కోసం గత కొంత కాలంగా సీడీపీవో కార్యాలయం చుట్టు తిరుగుతున్నాడు. బిల్లును మంజూరు చేయాలంటే డబ్బు ఇవ్వాల్సిందేనని సీడీపీవో, సీనియర్ సహాయకుడు డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఐసీడీఎస్ కార్యాలయంలో నగదు అందచేస్తుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు... సీడీపీవోతో పాటు సీనియర్ సహాయకుణ్ని పట్టుకున్నారు. వీరు ఇరువురిపై కేసు నమోదు చేసి విశాఖ ఏసీబీ కోర్టులు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. బిల్లుల మంజూరు, ఏజెన్సీ పునరుద్ధరణ కోసం సీడీపీవో లంచం కోసం భీష్మించటంతో విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు.
ఇదీ చూడండి: రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ