రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ తనిఖీలు రెండో రోజు కొనసాగాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలిక కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో అనిశా దాడులు కొనసాగాయి. పురపాలిక పరిధిలోని పలు భవనాలను అధికారులు పరిశీలించారు. మైదుకూరు రోడ్డు, గాంధీ రోడ్డులోని దుకాణాలు, ప్రైవేటు కళాశాలలు, ఆస్పత్రులను తనిఖీ చేశారు. కొన్ని చోట్ల అక్రమ కట్టడాలను గుర్తించినట్లు అనిశా డీఎస్పీ తెలిపారు. అక్రమంగా అనుమతి పొందిన 132 భవనాలకు చెందిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నామని... నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు డీఎస్పీ జనార్దన్‌నాయుడు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ కార్యాలయం పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లోని వివరాలు వాస్తవ దూరంగా ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు, అధికారుల పర్యవేక్షణ లోపం వంటి అంశాలను గుర్తించినట్లు తెలిపారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు అనిశా అధికారులు గుర్తించారు. లీ ప్యారడైజ్ కల్యాణ మండపాన్ని పరిశీలించిన అధికారులు... నిబంధనలకు విరుద్ధంగా.. దేవదాయశాఖ భూముల్లో దీనిని నిర్మించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి- 'అవినీతి నిరూపిస్తే విషం తాగుతా'