విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరుకు చెందిన నూకమ్మ, రాము దంపతులు. మత్స్యకార కుటుంబానికి చెందిన వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇంతకాలం పిల్లలు లేరని బాధపడ్డ ఈ దంపతులకు... ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు. అదీ అమ్మాయిలే కావడం విశేషం.
నిజంగా ఆశ్చర్యమే...!
సంతానం కోసం ఈ మత్య్యకార దంపతులు ఇన్నాళ్లూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరకు ఈ ఎదురు చూపులు ఫలించి నూకమ్మ గర్భం దాల్చింది. ఈ నెల 9న విజయనగరంలోని వెంకటపద్మ ఆసుపత్రిలో నూకమ్మ ప్రసవం కోసం చేరింది. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. చిన్నారులు తక్కువ బరువు ఉండడం వల్ల ప్రస్తుతం వారిని ప్రత్యేక వైద్య విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి ఘటనలు నిజంగా ఆశ్చర్యమేనని వైద్యులు వెంకటేశ్వర్రావు చెప్పారు.
అవధుల్లేని ఆనందం
మూడేళ్ల వరకూ పిల్లలు లేని ఆ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించటం... వారూ అమ్మాయిలే కావడం... తల్లిదండ్రులకే కాక.. బంధువులకూ అంతులేని ఆనందాన్ని కలిగించింది. తమ ఇంటికి ఒకేసారి ముగ్గురు మహాలక్ష్ములు వచ్చారని అంతా సంతోషపడుతున్నారు. మత్స్యకార కుటుంబానికి చెందిన ఈ దంపతులు చేపల వేటకు వెళితే గానీ ఇళ్లు గడవదు. అలాంటప్పుడు ముగ్గురు పిల్లలను ఒకేసారి సంరక్షించడం ఇబ్బందికరమని కుటుంబసభ్యులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా.. ఎన్ని కష్టాలెదురైనా పిల్లలను మాత్రం జాగ్రత్తగా పెంచుకుంటామని తల్లిదండ్రులు సంతోషంగా చెబుతున్నారు.
ఇదీ చూడండి: