1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను పరిష్కరించిన నేపథ్యంలో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు చినమేరంగి క్యాంపు కార్యాలయంలో గురువారం ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిని కలిసి వినతపత్రం సమర్పించారు.
1998లో డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరగడానికి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే కారణమని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలోనూ వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెదేపా అధినేత వారికి న్యాయం చేయలేకపోయారని ధ్వజమెత్తారు. 1998లో తమకు చంద్రబాబు కారణంగానే తీరని అన్యాయం జరిగిందని, 2014 లోనైనా తమకు న్యాయం చేస్తాడని నమ్ముకొని మరోసారి మోసపోయామని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సంఘం నేతలు వాపోయారు. ఆ కారణంగా తాము రెండు దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం పోరాడుతూ నిరుద్యోగులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆ సంఘం నేతలు అభ్యర్థించారు.
ఇదీ చదవండి :