'జూ'లో సరీసృపాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు వేదికగా జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. సెంట్రల్ 'జూ' అథారిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని.. అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రతీప్‌కుమార్ ప్రారంభించారు. దేశంలోని వివిధ 'జూ'ల సిబ్బంది, జంతు ప్రేమికులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పాములు, మొసళ్లు, తాబేళ్లు వంటి సరీసృపాల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. జూ కీపర్స్‌కు శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా పాల్గొంటున్న సిబ్బందికి.. ప్రత్యేకంగా రూపొందించిన వీడియోల ద్వారా శిక్షణ ఇచ్చారు.
సరీసృపాల సంరక్షణపై జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమం జరగడం ఇదే ప్రథమమని.. అటవీశాఖ అధికారులు తెలిపారు. కొవిడ్ కారణంగా చాలామంది 'జూ కీపర్స్' ఆన్‌లైన్ ద్వారా శిక్షణలో పాల్గొంటున్నట్లు చెప్పారు.
సరీసృపాల సంరక్షణకు విశాఖ జూలాజికల్ పార్క్ అనువైన ప్రదేశమని.. పార్కు క్యూరేటర్ నందని సలారియా తెలిపారు. సరీసృపాల జీవన లక్షణాలు మిగతా జీవుల కంటే ఎంతో ప్రత్యేకమన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా.. సరీసృపాలకు హాని కలగకుండా పరిరక్షించవచ్చనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.