Market value of property Hike in Vizag : విశాఖలో భూముల మార్కెట్ విలువ రెట్టింపు చేసేందుకు ప్రతిపాందించిన ప్రాంతాలకు సమీపంలోనే వైసీపీ పెద్దల భాగస్వామ్యంతో జరుగుతున్న భారీ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల చదరపు గజం 25 వేల రూపాయలుంటే.. 40 వేలకు, మరికొన్ని చోట్ల 28 వేల రూపాయల నుంచి 50 వేలకు పెంచేందుకు అధికారులు ప్రతిపాందించారు. అనుకున్నట్లే జరిగితే పెంపును ఆధారంగా చేసుకొని ప్రస్తుతం నిర్మాణ దశలోని ప్రాజెక్టులను మరింత అధిక ధరలకు విక్రయిస్తారు.
బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. జాతీయ రహదారి-16లో మధురవాడ నుంచి న్యాయ కళాశాల మీదుగా రుషికొండ వరకు ఉన్న మార్గంలో ఉన్న భూముల మార్కెట్ విలువ భారీగా పెంచేందుకు ప్రతిపాందించారు. ఈ రోడ్డులోనే వైసీపీ కీలక నేతల కుటుంబసభ్యులు, వారి సహకారంతో జరుగుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి. రుషికొండ సమీపంలో 50 ఎకరాల్లో వైసీపీ కీలక నేత బంధువు ఓ ప్రాజెక్టు చేపడుతున్నారు. పై స్థాయి నుంచి ఇక్కడ విలువలు భారీగా పెంచడానికి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం.
ఇదీ చదవండి : People Rejecting Cent Land: సెంటు భూమి వద్దు..తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే.. పరిపాలన కేంద్రమైన కోర్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతానికి భీమిలి మండలం కాపులుప్పాడ సమీపంలో ఉంటుంది. ఇక్కడ జరిగే క్రయవిక్రయాలే భీమిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆదాయానికి కీలకం. ప్రస్తుత ప్రత్యేకంగా చేసిన సవరణలో ఈ ప్రాంతంలో మార్కెట్ విలువ పెరగకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు భవిష్యత్తులో ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయనుండటంతో ధరలు పెంచలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మొదటి ప్రాధాన్యాన్ని జాతీయ రహదారులు, ఇతర రహదారుల పక్కనున్న భూముల విలువ పెంచడానికి ఇస్తారు. ప్రస్తుత సవరణలో అలాంటి ఆలోచనను కొన్నిచోట్ల పక్కన పెట్టేశారు. భీమిలి నుంచి భోగాపురం వరకు నిర్మిచ తలపెట్టిన ఆరువరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి సమీపంలో భూముల ధరలు పెంచితే.. మారిన విలువల ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలనే డిమాండ్ రైతుల నుంచి రావొచ్చని ఆలోచించినట్లు తెలుస్తోంది. పెందుర్తి, గాజువాక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రహదారుల విస్తరణ జరగనున్న ప్రాంతాల్లోనూ పెంపుపై ప్రతిపాదనలు చేయలేదు. విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోనూ కొన్నిచోట్ల పెంచలేదు.
ఇవీ చదవండి :