Writ Petition in Supreme Court on Rushikonda: రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై లింగమనేని శివరామ్ ప్రసాద్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించారని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌పై ఎన్‌జీటీలో విచారణ జరుగుతోందని.. అయినా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. గంతలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించారని శివరామ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు జీవోను రద్దు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. విశాఖలో అధికారుల కార్యాలయాల ఏర్పాటు జీవో రద్దు చేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. రుషికొండపై రిసార్ట్ నిర్మాణంపై దాఖలైన కేసులు పరిష్కారం అయ్యే వరకూ... రుషికొండపై నిర్మాణాలు జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని శివరామ్ ప్రసాద్ కోర్టును కోరారు. ఈ కేసుకు సంబందించి గతంలో రుషికొండ నిర్మాణాలపై సుప్రీం ఉత్తర్వుల కాపీ జతచేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ప్రణాళిక ప్రకారమే నిర్మాణాలు: రుషికొండపై పర్యాటక రిసార్ట్ పునరుద్ధరణ పేరుతో మొదలు పెట్టిన నిర్మాణ పనులు.. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయానికి కేటాయించేలా అడుగులు వేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకోసమే రుషికొండపై అప్పటికే ఉన్న పర్యాటక శాఖకు చెందిన దృఢంగా ఉన్న రిసార్టును కూలగొట్టారు. అనంతరం ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా 2021 జులైలో రుషికొండ పరిసర ప్రాంతాల్లో రిసార్ట్ పునరుద్ధరణ పేరుతో పనులను... తాము అనుకున్నవారికి కట్టబెట్టారు. నిర్మాణాలపై ప్రతిపక్షాలు, పర్యావరణ వేత్తలు ప్రశ్నిస్తే ‘సమీకృత పర్యాటక సముదాయాన్ని’ నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ భవన సముదాయంలో అతిథిగృహాలు, కన్వెన్షన్ సెంటర్లు, ఆడిటోరియం, హోటళ్లు, ఉల్లాస కేంద్రాలు, వినోద ప్రదర్శన కేంద్రాలు, క్రీడల నిర్వహణ ప్రాంతాలు.. ఇతర సౌకర్యాలు కల్పించాలని అందులో స్పష్టం చేశారు. ఇప్పటికి సుమారు రూ. 270 కోట్ల వరకు నిధులు రుషికొండపై కుమ్మరించారు.
వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీ: డిసెంబర్ నుంచి తాను విశాఖ నుంచి పరిపాలన కొనసాగించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతితో పాటుగా... మంత్రులు, అధికారులకు ట్రాన్సిట్ వసతి కోసం... అధికారుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా వెల్లడించలేదు. ఈ మేరకు రుషికొండపై పర్యాటక శాఖ పేరుతో నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం, అలాగే అక్కడికి సమీపంలోనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన మరో భవనంలో ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రుషికొండను తొలిచి నూతనంగా నిర్మించిన పర్యాటక శాఖ భవనాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుగుణంగా తీర్చిదిద్ది భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.