Organic Farming in Visakhapatnam: విశాఖ నగరం మధురవాడకు చెందిన బంగారు ఝాన్సీ కుటుంబ సంరక్షణ చూసుకుంటూనే మిద్దె తోటల సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె... సేంద్రియ వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ఇంట్లో ఉండే పాత డబ్బాలు, ప్లాస్టిక్ బకెట్లు, డబ్బాలనే కుండీలు ఉపయోగిస్తూ మొక్కలు పెంచుతున్నారు. కొన్ని మొక్కలకు మార్కెట్‌లో లభించే గ్రో బ్యాగ్‌లనూ వాడుతున్నారు. అంతే కాకుండా పండ్ల మొక్కల కోసం శాశ్వత మడులను నిర్మించుకున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా వారి ఇంటి మేడపై ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు.
ఎన్ని రకాలు సాగుచేస్తున్నారంటే..!
బెండ, గోరు చిక్కుడు, సొరకాయ, మిర్చి, వంగ, బీర, దొండ, టమాటా, మునగ వంటి కూరగాయలు.. పొన్నగంటి, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీన, కరివేపాకు వంటి ఆకుకూరలు.. వామి, తులసి వంటి ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. ఇక పూల మొక్కల సంగతి సరే సరి. ఒక్కసారి డాబా పైకి వెళితే చాలు చిన్నపాటి తోట మనకు స్వాగతం పలుకుతుంది. ఇక పండ్ల విషయానికొస్తే మామిడి, సపోటా, నారింజ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్స్, అంజీర, టేబుల్ నిమ్మ , మల్బరీ, చెరుకు, నేరేడులను పండిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.
ఎరువులను కూడా తయారు చేస్తూ.. ఎటువంటి రసాయనాలు వాడకుండా ఝాన్సీ తన మిద్దె తోటకు కావాల్సిన ఎరువులను వంట గది వ్యర్థాలతో తయారు చేసుకుంటున్నారు. అలాగే చెట్ల నుండి వచ్చిన ఎండుటాకులు, తీసేసిన మొక్కలతో కూడా కంపోస్ట్ తయారు చేసి మొక్కలకు ఎరువులుగా అందిస్తున్నారు. అలాగే "చోహాన్ క్యూ" పద్ధతుల్లో అనేక రకాల సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ మొక్కలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. సేంద్రియ విధానంలో మిద్దె మీద వ్యవసాయం చేస్తున్న బంగారు ఝాన్సీ.. అదే రీతిలోనే అనేక పద్దతుల్లో చీడ పురుగులను నియంత్రిస్తూన్నారు. వేప నూనె, కుంకుడికాయ రసం, గ్రుడ్డు నూనె, ఇంగువ ద్రావకం, మిర్చి ద్రావకం లాంటివి వినియోగిస్తూ మొక్కలను ఆరోగ్యంగా పెంచుతూ సత్ఫాలితాలను సాధిస్తున్నారు.
మిద్దె సాగుపై ఆసక్తి ఉన్నవారికి సలహాలు.. సేంద్రియ పద్ధతిపై అవగాహన పెంచుకుని మిద్దె తోట ప్రారంభించిన ఝాన్సీ.. మొదట ఆకుకూరల సాగు ప్రారంభించి తర్వాత కూరగాయల సాగు.. తర్వాత పండ్లను కూడా పండించడంతో క్రమంగా సాగు ఆమెకు వ్యాపకంగా మారిపోయింది. వీటితో పాటు ఇంటిలో అందంగా అలంకరించుకోవడానికి పలు రకాల ఇంటీరియర్ డిజైన్ మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఇంట్లో పూర్తిగా ఆర్గానిక్ కూరగాయలనే వాడటంతో పాటు చుట్టుపక్కల వారికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉచితంగా ఇస్తుంటారు. మిద్దె సాగుపై ఆసక్తి ఉన్నవారికి సలహాలు, సూచనలు చేస్తూ ఉంటారు. మిద్దె తోటలు పెంచడానికి పెద్దగా ఖర్చూ కావడం లేదని... ఇప్పటికీ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆమె బలంగా నమ్ముతారు. చిన్న జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవీ చదవండి: