విశాఖ మీదుగా వెళ్లే వాల్తేరు డివిజన్ రైళ్లలో సమగ్ర ప్రక్షాళనకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేస్తున్నారు. విశాఖలోని రైల్వే కోచింగ్ డిపోలో 74 రైళ్ల నిర్వహణ జరుగుతుంది. వీటిలో ఏసీ, స్లీపర్, ఛార్జింగ్ పాయింట్ల దగ్గర నుంచి అన్ని సమస్యలపైనా దృష్టి పెడుతున్నారు. ప్రత్యేకించి నిర్వహణ లోపాలపై రైళ్ల వారీగా నివేదికలు తయారుచేస్తున్నారు. ట్విటర్, రైల్వే హెల్ప్‌లైన్లకు వచ్చే ఫిర్యాదుల్నీ క్రోడీకరిస్తున్నారు.
డివిజన్ నిర్వహించే 74 రైళ్లలో 40మాత్రమే అధునాతన లింక్ హాఫ్‌మన్ బుష్-ఎల్.హెచ్.బీ కోచ్‌లతో నడుస్తున్నాయి. మిగిలిన 34 రైళ్లలో పాత కోచ్‌లే ఉన్నాయి. ప్రస్తుతం డివిజన్ పరిధిలో.. 320 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుంటే అందులో 150దాకా పాతవే ఉన్నట్లు గుర్తించారు. వీటిలో లోపాలపై నివేదికలు తయారవుతున్నాయి.
చాలా కోచ్‌ల్లో మరమ్మతుల సమస్య వేధిస్తోంది. వీటిలో విశాఖలోనే మరమ్మతులు పూర్తయ్యే వాటి జాబితా రూపొందిస్తున్నారు. దానికి మించి సమస్యలున్న కోచ్‌ల్ని, అలాగే 15ఏళ్ల దాటిన కోచ్‌ల్ని అధునాతనంగా మార్చడం, లేదా కొత్తవి ప్రవేశపెట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కోచ్‌ల్లో ఉన్న పరిస్థితి, కొత్త కోచ్‌లపై... భువనేశ్వర్‌లోని తూర్పుకోస్తా రైల్వేజోన్ ఉన్నతాధికారులు, దిల్లీలోని రైల్వేబోర్డు సభ్యులతో వాల్తేరు డీఆర్ఎం చర్చించారు. విశాఖ రైళ్లపై త్వరలో మంచి కబురు వింటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వాల్తేరు డివిజన్‌లో వంద శాతం మార్పు చూపిస్తామని.. డీఆర్‌ఎం అనుప్ కుమార్ సతపతి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: అప్పుల బాధతో తండ్రి.. కూల్ డ్రింక్ అనుకొని కుమారుడు..