అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించేందుకు ఈనెల 12, 13 తేదీల్లో విశాఖ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి సాధారణ స్పందన లభించింది. 12వ తేదీన నమోదులు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు 5,596 దరఖాస్తులు రాగా, వాటిలో నమోదుకు 4800 వరకు వచ్చాయి. ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా 6వేల వరకు దరఖాస్తులు రాగా, వాటిలో నమోదులకు 5,200 వరకు ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో మొత్తంగా 11వేలకు పైగా దరఖాస్తులు వస్తే ఓటు నమోదుకు 10వేల వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు వస్తే ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా ఉండనున్నది.
ఓటరు జాబితాల సంక్షిప్త సవరణ గత నెల 16న ప్రారంభమైంది. ఈనెల 15 వరకు కొనసాగనున్నది. గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంలో 10వేల వరకు ఓటు నమోదు దరఖాస్తులు రాగా, ఈనెల 12, 13 తేదీల్లో నిర్వహించిన కార్యక్రమానికి అంతే స్థాయిలో వచ్చాయి.
జిల్లాలో ఈనెల 12 వరకు నమోదులు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు 26,898 దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం వచ్చిన దరఖాస్తులు కలిపితే ఈ సంఖ్య 37వేలకు చేరనున్నది. ఇంకా మరో రెండు రోజుల పాటు గడువు ఉంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో సైతం పేర్ల నమోదుకు అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవచ్ఛు ఈనెల 16 నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి అర్హుల పేర్లు జాబితాల్లో చేర్చే ప్రక్రియ ఆరంభమవుతుంది. అనంతరం తుది ఓటరు జాబితాల ముద్రణ చేపట్టనున్నారు.
ఇదీ చూడండి.